ఫేస్‌బుక్ బీజేపీ, ఆర్‌‌ఎస్ఎస్‌కు అనుకూలంగా పని చేస్తోంది

ఫేస్‌బుక్ బీజేపీ, ఆర్‌‌ఎస్ఎస్‌కు అనుకూలంగా పని చేస్తోంది

రాహుల్ గాంధీ విమర్శలు.. తిప్పికొట్టిన రవి శంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ఇండియాలో పనితీరు విషయంలో పక్షపాతంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఇండియాలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను బీజేపీ–ఆర్‌‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తున్నాయి. వాళ్లు ఫేక్‌ న్యూస్‌తోపాటు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు. ఆఖరికి, ఫేస్‌బుక్‌ గురించి అమెరికా మీడియా నిజాలను వెల్లడించింది’ అంటూ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. దీనికి జతగా ఫేస్‌బుక్ హేట్ స్పీచ్ రూల్స్ కొలైడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్ పేరుతో వాల్‌ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌ను జత చేశారు.

రాహుల్ ట్వీట్‌పై కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. తన పార్టీలోని వ్యక్తులను కూడా ప్రభావితం చేయలేని లూజర్స్ (ఓడిపోయినవారు).. మొత్తం ప్రపంచాన్ని ఆర్‌‌ఎస్‌ఎస్, బీజేపీ కంట్రోల్ చేస్తున్నాయని విమర్శిస్తారు. కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్‌బుక్‌తో కలసి డేటాను ఎన్నికల కోసం దుర్వినియోగం చేసే విషయంలో మీరు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అలాంటి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా?. నిజం ఏంటంటే.. భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఇవ్వాళ ప్రజాస్వామికం అయింది. మీ కుటుంబం ఏర్పాటు చేసిన వ్యక్తులతో అది ఎంతమాత్రం నియంత్రించబడదు. అందుకే మిమ్మల్ని ఇది ఇంతగా బాధిస్తోంది. బెంగళూరు అల్లర్లను మీరు ఖండించడాన్ని మేం వినలేదు. మీ ధైర్యం ఎక్కడ కనుమరుగైంది’ అని రవి శంకర్ ప్రసాద్ రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.