అధికారులను కదిలించిన ఫేస్​బుక్​ వీడియో

అధికారులను కదిలించిన ఫేస్​బుక్​ వీడియో

రైతు వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ ను ఆదేశించిన సీఎస్​

రైస్​మిల్లర్​తో కొనుగోలు చేయించిన సివిల్ సప్లై ఆఫీసర్లు

మంచిర్యాల, వెలుగు: సన్న వడ్లను పండించిన ఓ రైతు పంటను అమ్ముకోలేక.. తాను పడుతున్న కష్టాలను వివరిస్తూ ఫేస్​బుక్​లో పెట్టిన వీడియో అధికారులను కదిలించింది. కలెక్టర్​కు సీఎస్​ఫోన్​చేసి ఆ రైతు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన యువరైతు కొండపల్లి శరత్​ ఇటీవల ఫేస్​బుక్​లో వీడియో పోస్ట్​ చేశారు. అందులో ‘నేను ఏడెకరాల్లో జైశ్రీరాం రకం వడ్లు సాగు చేశాను. భారీ వర్షాలు, దోమపోటు, కాటుక తెగులును తట్టుకుని పండించిన పంటను ఎవరూ కొంటలేరు. కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్​-ఏ కింద క్వింటాలు రూ.1,888కి కొనుగోలు చేస్తుండగా, ఓపెన్​మార్కెట్​లో వ్యాపారులు రూ.1800లోపే చెల్లిస్తున్నారు. ఈ ధర నాకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. ఎవరైనా బియ్యం కొనేవారు ఉంటే చెప్పండి. మిల్లింగ్​చేయించి మార్కెట్​రేటు కంటే తక్కువకే అందిస్తాను. దయచేసి రైతులకు సపోర్టు చేయండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను వందలాది మంది షేర్​ చేయడంతో పాటు దాదాపు మూడు లక్షల మంది చూశారు. చివరకు సీఎస్​సోమేష్​కుమార్​దృష్టికి వెళ్లడంతో వెంటనే ఫోన్​లో శరత్​తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్​భారతి హోళికేరితో మాట్లాడి శరత్​ పండించిన వడ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్​సైతం శరత్​తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే రైస్​మిల్లర్లు వడ్లను కొనుగోలు చేసేలా చూడాలని డిస్ట్రిక్ట్​ సివిల్​సప్లై ఆఫీసర్​ వెంకటేశ్వర్లుకు సూచించారు. ఈ మేరకు మందమర్రిలోని ఒక రైస్​మిల్లర్​ను సంప్రదించగా మంగళవారం నందులపల్లెకు వెళ్లి క్వింటాలు రూ.2 వేల చొప్పున కొనుగోలు చేశారని డీసీఎస్​వో చెప్పారు.

గతంలో భూసమస్యపై స్పందించిన సీఎం

నందులపల్లిలోని సర్వే నంబరు 271/1ఏ సర్వే నంబరులో శరత్​తండ్రి శంకరయ్య పేరిట ఉన్న  7.01 ఎకరాల భూమిని వీఆర్వో కరుణాకర్​గుట్టుచప్పుడు కాకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా మార్పిడి చేశాడు. విషయం తెలిసిన శరత్​ భూమిని తిరిగి తన తండ్రి పేరిట పట్టా చేసివ్వాలని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన శరత్​ రెవెన్యూ ఆఫీసర్ల తీరును ఏకరువు పెడుతూ ఫేస్​బుక్​లో వీడియో పోస్ట్​ చేశాడు. ఇది సీఎం కేసీఆర్​ దృష్టికి వెళ్లడంతో గత ఏడాది మార్చి 27న స్వయంగా శరత్​తో మాట్లాడారు. భూసమస్యను పరిష్కరించాలని సీఎస్​ ద్వారా కలెక్టర్​కు ఆర్డర్స్​అందాయి. ఈ మేరకు ఎంక్వైరీ జరిపించిన కలెక్టర్​వీఆర్వో, ఆర్ఐలను సస్పెండ్​ చేశారు. శరత్​ తండ్రి శంకరయ్యకు పట్టా, 1-బీ, పహానీ
అందజేశారు.