ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్స్ ను డీయాక్టివేట్ చేస్తే డబ్బులిస్తారట!

ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్స్ ను డీయాక్టివేట్ చేస్తే డబ్బులిస్తారట!

ఫేస్ బుక్ వినూత్న నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతమేర ఉంటుందో తెలుసుకోవాలని ఫేస్ బుక్ భావిస్తోంది. దీంట్లో భాగంగా ఈ ఏడాది చివరలో జరగనున్న అమెరికా ఎలక్షన్స్ లో ఒక సర్వే నిర్వహించడానికి ఫేస్ బుక్ సిద్ధమవుతోందని సమాచారం. ఈ ఎన్నికల్లో ఓట్లు వేయబోయే వారు తమ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకోవాలని సోషల్ మీడియా దిగ్గజం కోరుతోంది. దీనికి గాను డబ్బులు కూడా చెల్లిస్తామనడం గమనార్హం.

ఈ మేరకు ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్లను ఎన్నికల ముందు రోజు లేదా ఒక వారం ముందు డీయాక్టివేట్ చేసుకుంటే ఇన్ని డాలర్ల మేర చెల్లిస్తామని యూజర్లకు ఫేస్ బుక్ నోటిస్ పంపింది. ఈ నోటీసుల స్క్రీన్ షాట్స్ ను వాషింగ్టన్ పోస్ట్ కు చెందిన ఎలిజబెత్ డ్వోస్కిన్ అనే రిపోర్టర్ ట్విట్టర్ లో షేర్ చేసింది. అకౌంట్ డీయాక్టివేషన్ పీరియడ్ ఒక వారం నుంచి ఆరు వారాల వరకు ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ టైమ్ లో యూజర్లు తమ ఎఫ్ బీ, ఇన్ స్టా అకౌంట్స్ ను వాడటానికి వీల్లేదని ఫేస్ బుక్ షరతు పెట్టింది. అందుకుగాను వారానికి 10 నుంచి 20 డాలర్ల వరకు చెల్లిస్తామని ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి లిజ్ బోర్గెస్ ధ్రువీకరించారు. తమ అకౌంట్లను నిర్ణీత పీరియడ్ లో వాడకుండా, డీయాక్టివేట్ చేసిన యూజర్లకు కంపెనీ డబ్బులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు.