రోజు వందకుపైగా మరణాలు.. వెహికల్స్ 15 మాత్రమే

రోజు వందకుపైగా మరణాలు.. వెహికల్స్ 15 మాత్రమే
  • పార్థివ వాహనం దొరుకుతలె
  • డెడ్​బాడీలు తరలించేందుకు పేదల కష్టాలు
  • సరిపడా వెహికల్స్ లేక గంటల తరబడి నిరీక్షణ
  • తప్పని స్థితిలో ప్రైవేట్ వాహనాలకు వేలల్లో ఖర్చు
  • రోజు వందకుపైగా మరణాలు.. వెహికల్స్ 15 మాత్రమే

హైదరాబాద్, వెలుగు: హైదారాబాద్​లోని ప్రభుత్వాసుపత్రుల నుంచి డెడ్ బాడీలను జిల్లాలకు తరలించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్థివ వాహనాలు తక్కువగా ఉండడంతో ఒక డెడ్ బాడీని వదిలి వచ్చేంత వరకు మరొకరు నిరీక్షించాల్సి వస్తోంది. డెడ్ బాడీతో 5 నుంచి 8 గంటలు వెయిట్ చేయలేక ప్రైవేట్ అంబులెన్స్​లలో తీసుకెళ్తున్నారు. ఇందుకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొందరు అప్పులు చేసి డెడ్ బాడీలను తరలిస్తుండగా, ఆ స్తోమతలేని వారు కొన్ని గంటలపాటు మార్చురీల దగ్గర వేచి ఉంటున్నారు. 6 నెలల కిందటి వరకు సిటీలోని అన్ని ప్రభుత్వాసుపత్రులకు కలిపి 25 పార్థివ వాహనాలు ఉండేవి. వీటిలో 20 వెహికల్స్​ సర్వీసు పూర్తవడంతో వాటిని స్క్రాప్ కింద తీసేశారు. మిగిలిన 5 వాహనాలతో పాటు డోనర్స్ సాయంతో కొత్తగా 11 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఒక అంబులెన్స్​కు ప్రమాదం జరగడంతో రిపేర్ లో ఉంది. ప్రస్తుతం 15 మాత్రమే సేవలు అందిస్తున్నాయి.  వీటితో రోజు 20 మందికి మించి సేవలు అందించలేదని పరిస్థితి. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్​జే క్యాన్సర్, నిలోఫర్, నిమ్స్ తదితర ఆస్పత్రుల్లో మరణించిన వారితో పాటు గాంధీ, ఉస్మానియాకు పోస్టుమార్టం కోసం వచ్చిన డెడ్ బాడీలను ఉచితంగా ఇంటికి చేర్చాల్సి ఉంది. ఈ వెహికల్స్ ను గాంధీ, ఉస్మానియాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు.

50 వాహనాలు అవసరం

సిటీలోని అన్ని సర్కార్ దవాఖానల నుంచి డెడ్ బాడీలను తరలించేందుకు కనీసం 50 పార్థివ వాహనాలు అవసరమని అధికారులు అంటున్నారు. ఆరు నెలల కింద ఉన్న 25 ఓల్డ్‌‌ వాహనాల్లో రోజు 30 నుంచి 40 మృతదేహాలను తరలించేవారు. ఇప్పుడవి తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కనీసం 50 వెహికల్స్ అవసరం. మరిన్ని పార్థివ వాహనాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సర్కార్ ఆస్పత్రుల నుంచి ప్రతిపాదనలు సైతం పంపారు. ప్రస్తుతం ఉన్న వాహనాలు సరిపోవడం లేదని, మృతదేహాలను తరలించేందుకు పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

తరలించేందుకు వేలల్లో ఖర్చు

ప్రభుత్వ ఆసుపత్రులకు ట్రీట్ మెంట్ కోసం వచ్చే వారిలో ఎక్కువగా నిరుపేదలు ఉంటారు. ట్రీట్ మెంట్ పొందుతూ మరణిస్తే డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఖర్చు భారమవుతోంది. హైదరాబాద్​లోని సర్కార్ దవాఖానల్లో రోజు వంద మంది వరకు మరణిస్తున్నారు. సిటీ నుంచి రాష్ట్రంలోని ఆయా గ్రామాలకు మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తరలిస్తే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. దూరం వందకిలోమీటర్ల లోపు ఉంటే ఆరు నుంచి ఏడు వేలు, ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ లాంటి దూర ప్రాంతాలకైతే రూ.20 వేలకుపైగా తీసుకుంటున్నారు. ఉచితంగా చేర్చే పార్థివ వాహనాలు సరిపడా లేక.. గంటలకు గంటలు నిరీక్షించలేక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా భారమైనా అప్పులు చేసి ప్రైవేట్ అంబులెన్సుల్లో తరలిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన సాయికుమార్ గాంధీలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతదేహాన్ని తరలించే వాహనం కోసం కుటుంబ సభ్యులు వైద్యాధికారులను సంప్రదించారు. వాహనం రావడానికి ఐదారు గంటల టైమ్ పడుతుందని చెప్పడంతో ప్రైవేట్ అంబులెన్స్‌‌కు రూ.6 వేలు ఖర్చుపెట్టి స్వగ్రామం తీసుకెళ్లారు.