గుళ్ళలోని బంగారాన్ని అమ్మేయబోతున్నారా..? కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

గుళ్ళలోని బంగారాన్ని అమ్మేయబోతున్నారా..? కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

దేశంలోని దేవాలయాలు, మతపరమైన సంస్థల దగ్గర ఉన్న బంగారాన్ని మోడీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. గుళ్ళలోని బంగారాన్ని మానిటైజ్ అంటే రూపంలోకి మార్చే ఆలోచనలు లేదా ప్లాన్స్ తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇలాంటి ఊహాగానాలు, పుకార్లు పూర్తిగా అబద్ధమైనవని.. ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఎక్స్ ఖాతాలో తేల్చేసింది.

గుళ్ళల్లో భద్రపరిచిన బంగారానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం టెంపుల్ ట్రస్టులకు ‘గోల్డ్ బాండ్స్’ జారీ చేయనుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం పడిందంటూ ప్రచారం జరిగింది. దీనివల్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాలను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. దేవాలయాల గోపురాలు, తలుపులు, ఇతర నిర్మాణాలపై ఉండే బంగారు పూతలను, ప్లేట్లను వ్యూహాత్మక బంగారు నిల్వలుగా పరిగణిస్తారనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.

ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని ప్రభుత్వం కోరింది. ఇలాంటి పుకార్లు సమాజంలో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తాయని పేర్కొంది. అధికారిక పాలసీ నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారమైనా కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రెస్ రిలీజ్‌లు, వెరిఫైడ్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మాత్రమే షేర్ చేయబడుతుందని వెల్లడించింది.

►ALSO READ | Paytm: ఇకపై పేరెంట్స్ ఫోన్లతో పనిలేదు.. పిల్లల కోసమే ప్రత్యేకంగా ‘పేటీఎం పాకెట్ మనీ’

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక పుకారుపై వారం రోజుల్లోనే క్లారిటీ ఇవ్వడం ఇది రెండోసారి. దీనికి ముందు విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం కొత్తగా పన్ను విధించబోతోందనే వార్తలను స్వయంగా ప్రధాని మోడీ ఖండించారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో దేశీయంగా ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ సంక్షోభాన్ని మేనేజ్ చేయడానికి కేంద్రం పెట్రోల్ ధరల పెంపు, బంగారం దిగుమతులపై పన్నులు పెంచడం, పొదుపు చర్యలు వంటి వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. వీటి కోసం దేవాలయాల బంగారాన్ని ముట్టుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పేసింది.