ముషీరాబాద్, వెలుగు: ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సహకారంతో బాగ్‌లింగంపల్లిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల్లో ‘ఫ్యాకల్టీ ఎంగేజ్‌మెంట్ విత్ స్టూడెంట్స్ ఫర్ అవుట్‌కమ్ బేస్డ్ అండ్ ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్: ఎక్స్‌ప్లోరింగ్ ఎఫెక్టివ్ పాత్‌వేస్’ అనే అనే అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఎదుగుదలకు అడ్డుపడుతున్న కుల వివక్ష, లైంగిక వేధింపులు, డిజిటల్ పరధ్యానాలను అధ్యాపకులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
విద్యార్థులకు మెంటార్‌షిప్, కౌన్సెలింగ్ ఎంతో అవసరమని, కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా జ్ఞానాన్ని పంచేలా బోధన ఉండాలని పేర్కొన్నారు. మరో అతిథి, ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో భారతీయ సంస్కృతిని జోడించాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై అధ్యాపకులు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యాదగిరి, డా. శర్మ, ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ లావణ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

