
- కోఠి విమెన్ యూనివర్సిటీ నుంచి ఓయూకు వెళ్లేందుకు ఫ్యాకల్టీల పైరవీలు
- కొత్త వర్సిటీ కష్టాల నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ప్లాన్
- ఓయూ అఫ్లియేషన్ పోతుందని మరో కారణం
సికింద్రాబాద్, వెలుగు: కోఠి విమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటిస్తూ గత నెల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 1 నుంచి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఓయూకు అనుబంధంగా ఉన్న కోఠి విమెన్స్ కాలేజీ .. అప్పుడు అటానమస్‌గా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్ట్ టైమ్ లెక్చరర్లు ఓయూ అనుబంధ కాలేజీలకు వెళ్లేందుకు పైరవీలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
మహిళా యూనివర్సిటీలో ఉంటే ఓయూ పరిధిలోకి రాలేమని ఫ్యాకల్టీలు పైరవీ షురూ చేసినట్లు సమాచారం. అందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మహిళా యూనివర్సిటీలో ఉంటే తమకు ఓయూ ప్రొఫెసర్లమనే గుర్తింపు ఉండదని, పైగా కొత్త యూనివర్సిటీ వల్ల కలిగే కష్ట నష్టాలను తప్పించుకోవచ్చని వారు భావిస్తున్నారు.
కాంట్రాక్ట్ వాళ్లే ఎక్కువ..
ఇప్పటి వరకూ కోఠి విమెన్స్ కాలేజీ దాదాపు కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్లతోనే నడిచింది. ఇక్కడ పర్మినెంట్ ప్రొఫెసర్ల కంటే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీనే ఎక్కువ. ప్రస్తుతం పర్మినెంట్ ప్రొఫెసర్లు 30 లోపే ఉండగా.. 110 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 200 పార్ట్ టైమ్ లెక్చరర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. పర్మినెంట్ ప్రొఫెసర్లకు మాత్రం వేరే కాలేజీలకు, ఓయూకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రం విమెన్ యూనివర్సిటీలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరికి ఓయూ అనుబంధ కాలేజీలకు వెళ్లేందుకు ఎలాంటి ఆప్షన్ లేదు. ఈ పరిస్థితులే పైరవీలకు దారి తీస్తున్నాయి.
దందా షురూ...
కోఠి విమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చిన ప్రభుత్వం.. ఈ క్యాంపస్‌ను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు కోఠి నుంచి ఈ క్యాంపస్‌ను వికారాబాద్‌కు, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. అయితే ఇదే కాలేజీలో ఉంటే తామంతా సిటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ ఓయూకు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్రవీందర్యాదవ్ అమెరికా టూర్‌లో ఉన్నారని.. ఆయన రాగానే పనులు పూర్తిచేస్తామని పైరవీకారులు కొందరు ఫ్యాకల్టీతో చెప్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వారు పైరవీకారులకు ఎంతైనా డబ్బు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.