బల్కంపేట గుడిలో తొక్కిసలాట.. క్యూలైన్లలో భక్తుల అవస్థలు

బల్కంపేట గుడిలో తొక్కిసలాట.. క్యూలైన్లలో భక్తుల అవస్థలు

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం ఏర్పాట్లలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపించింది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం సందర్భంగా సరైన ఏర్పాట్లు లేక భక్తులు నానా అవస్థలు పడ్డారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ, పోలీస్ శాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రద్దీగా తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేశామని చెప్పుకున్నా.. వాస్తవానికి అలాంటి ఏర్పాట్లు కనిపించలేదు. 

పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది. భక్తులను నిలువరించలేక పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూలైన్ లో అవస్థలు పడుతున్నారు. కొంతమంది మహిళలు స్రృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే వారికి పోలీసులతో పాటు స్థానికులు సపర్యలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు కరెంట్ షాక్ కు గురైనట్లు సమాచారం అందుతోంది. 

అధికారుల నిర్వహణ, ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా తగ్గట్లుగా సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. సాధారణ భక్తులను క్యూలైన్ లో గంటల తరబడి నిల్చోబెట్టి.. వీఐపీలు, వీవీఐపీలకు దర్శనం చేయిస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహిస్తుంటారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం (జూన్ 19వ తేదీన) ఘనంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. మంగళవారం ఎల్లమ్మ కల్యాణం నిర్వహించారు. బుధవారం సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. 

ALSO READ: కదిలిన జగన్నాథ రథయాత్ర.. పోటెత్తిన భక్తజనం