 
                                    దేశ వ్యాప్తంగా జగన్నాథ యాత్ర ప్రారంభమైంది. పూరీ, అహ్మదాబాద్, హైదరాబాద్ లలోని ప్రతిష్టాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుడి రథం బయల‌్దేరింది. ఒడిశాలోని పూరీలో, హైదరాబాద్ బంజరాహిల్స్ రోడ్ నెం.12 లోని జగన్నాథ స్వామిఆలయం, గుజరాత్ లోని ఆహ్మదాబాద్ ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్ర యాత్రను నిర్వహిస్తున్నారు.రథయాత్రను అద్భుతంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 రోజులు ఈ యాత్ర పండుగలా సాగనుంది.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్రను జరుపుతారు. దేశ, విదేశాల నుండి లక్షల్లో భక్తులు ఈ రథ యాత్రలో పాల్గొంటారు. పూరి నగరం లోని జగన్నాథుని తీర్థ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్ర యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ యాత్ర కి వెళ్తే అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని అంతా నమ్ముతారు.
హైదరాబాద్ లో ..
హైదరాబాద్ బంజరాహిల్స్ రోడ్ నెం.12 లోని జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో రథయాత్ర వైభవంగా జరిగింది. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో భక్తులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మాలలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ నిర్వాహకులు. రథయాత్రలో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
హైదరాబాద్‌లోని అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్టీఆర్ స్టేడియం నుంచి జలవిహార్ వరకు శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు. శ్రీ జగన్నాథ రథయాత్ర జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు కొనసాగుతున్నాయి. శ్రీ జగన్నాథ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి మొదలై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, జీహెచ్‌ఎంసీ ఆఫీసు, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా జలవిహార్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.
ఒడిశాలో...
ఒడిశాలోని ప్రముఖ శ్రీ క్షేత్రం పూరీ జగన్నాథుని రథయాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మంగళవారం( జూన్ 20) ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై బంగారు చీపురుతో ఊడ్చిన రథయాత్ర ప్రారంభమయింది. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగారు. సాయంత్రంలోగా రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారని ఆలయాధికారులు అంచనా వేశారు.
ఇక, నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు సోమవారం ( జూన్ 19) సాయంత్రం 6.30 గంటలకు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్డన్ వద్దకు చేరుకున్నాయి. దీనికి ముందుగా అర్చకులు ఆలయం నుంచి జగన్నాథుడి మెడలోని పూల మాలలు తెచ్చి మూడు రథల మధ్య ఉంచి పూజలు చేశారు. ఆ తరువాత హరిబోల్ నినాదాల మధ్య పోలీసులు, భక్తులు కలిసి శ్రీక్షేత్ర కార్యాలయం నుంచి జగన్నాథ సన్నిధి వరకు రథాలు లాక్కెళ్లారు
పూరీలో జరిగే రథయాత్రకు ఏటా కొత్తగా రథాలు తయారు చేస్తారు. అంతేకాదు, సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా ఉత్సవ విగ్రహాలనే ఊరేగింపుగా తీసుకెళతారు. కానీ, పూరీలో దీనికి భిన్నం. ఏకంగా మూల విరాట్టులే ఆలయం నుంచి బయటకు వచ్చి భక్త జనులకు నేత్రపర్వం చేస్తాయి. జనఘోషలో జగన్నాథుని జన యాత్ర సాగుతుంది. ఎంత దూరం నుంచైనా స్వామిని భక్తులు చూడగలగడం ప్రత్యేకత. ఘోష యాత్రలో స్వామి దివ్య తేజస్సుతో దర్శనిమిచ్చారు.
ALSO READ: బల్కంపేట గుడిలో తొక్కిసలాట.. క్యూలైన్లలో భక్తుల అవస్థలు

 
         
                     
                     
                    