ఢిల్లీకి ఫేక్ సర్టిఫికెట్ల ముఠా లింక్​లు..మరో ముగ్గురు అరెస్ట్

ఢిల్లీకి ఫేక్ సర్టిఫికెట్ల ముఠా లింక్​లు..మరో ముగ్గురు అరెస్ట్
  • 15 ఫేక్ సర్టిఫికెట్ల సీజ్

మెహిదీపట్నం, వెలుగు: సిటీలో ఫేక్ ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. మొన్న మెహిదీపట్నంలో నలుగురు.. నిన్న మాసబ్ ట్యాంక్​లో ఇద్దరిని పట్టుకోగా.. మూడోరోజు మరో ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వివిధ వర్సిటీలకు చెందిన 15 ఫేక్ సర్టిఫికెట్లు, మూడు సెల్​ఫోన్లు, రూ.8 వేల నగదు సీజ్ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం ఈ కేసు వివరాలను వెల్లడించారు.

మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి షాబాజ్ ఖాన్ (29) ఫేక్ సర్టిఫికెట్లు సప్లై చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకొని విచారించారు. డబ్బులిస్తే తనకు యాకుత్ పురాకు చెందిన బార్బర్ మహ్మద్ అబ్దుల్ ఇస్మాయిల్ (30) కావాల్సిన సర్టిఫికెట్లను ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇస్మాయిల్​ను​అరెస్ట్ చేసి ప్రశ్నించగా, అతనికి ఆదిలాబాద్​జిల్లా మన్మాడ్ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ కడారి రమేశ్ (52) వీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు.

 ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కడారి రమేశ్ కు ఢిల్లీకి చెందిన సాగర్ అనే వ్యక్తి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. సాగర్ కు దేశంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లతో పాటు సబ్ ఏజెంట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.