- కిలాడీ బాలకృష్ణ కహానీ వింటే షాక్ అవ్వాల్సిందే!
హైదరాబాద్ సిటీ, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ సీఐఎస్‌ఎఫ్ ఆఫీసర్ ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి యూనిఫాం ధరించి దర్జాగా ఎయిర్పోర్టులో తిరుగుతూ, అనుమానాస్పదంగా ఫొటోలు, వీడియోలు దిగుతున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణకు గతంలో వివాహమై భార్యతో విడిపోయి పెడదారి పట్టాడు. సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ, తన మాటకారితనంతో మాయమాటలు చెప్పేవాడు.
ఆ పరిచయాలను ప్రేమ, పెండ్లి వరకు తీసుకెళ్లేవాడు. మ్యాట్రిమొనీతో పాటు సోషల్ మీడియాలో తాను పెద్ద ఆఫీసర్నంటూ నకిలీ ఐడీ కార్డులు, యూనిఫాం ఫొటోలతో బిల్డప్ ఇస్తూ, ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో సుమారు 70 మంది యువతులను నమ్మించి వారి నుంచి భారీగా నగదు, నగలు కాజేసి పారిపోయేవాడు. ఒక అమ్మాయికి తెలియకుండా మరొక అమ్మాయితో పెండ్లికి సిద్ధపడటం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య.
ఈ క్రమంలోనే ఫేస్బుక్లో పరిచయమైన ఓ అమ్మాయిని నమ్మించడానికి తానూ కొత్తగా కొనుగోలు చేసిన యూనిఫాం వేసుకుని తనకు జాబ్ వచ్చిందని, ట్రైనింగ్ చేస్తున్నానని కలరింగ్ ఇస్తూ ఎయిర్పోర్టులో ఫొటోలు దిగుతుండగా భద్రతా సిబ్బందికి చిక్కాడు. నిందితుడి నుంచి నకిలీ యూనిఫాం, ఐడీ కార్డు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇతడి సెల్ ఫోన్ డేటా విశ్లేషిస్తే మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

