V6 News

సీఎంను కలిపిస్తా.. మెసేజ్ చేయండి..సెక్రటేరియెట్‌‌‌‌ లో ఫేక్ కానిస్టేబుల్ రీల్స్

సీఎంను కలిపిస్తా.. మెసేజ్ చేయండి..సెక్రటేరియెట్‌‌‌‌ లో ఫేక్ కానిస్టేబుల్ రీల్స్
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సైఫాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ నకిలీ కానిస్టేబుల్‌‌‌‌ను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన రవి (అలియాస్ నిఖిల్ యాదవ్) అనే వ్యక్తికి పోలీస్ కావాలనే కోరికతో నిత్యం పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్స్ చేస్తున్నాడు. ఇటీవల కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చిన రవి.. సెక్రటేరియెట్ గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని బతిమిలాడి ఫొటోల కోసం లోపలికి వెళ్లాడు.

అక్కడ కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగడమే కాకుండా.. సీఎంను కలవాలంటే తనకు మెసేజ్ చేయాలని, ఏ పార్టీ వారినైనా కలిపిస్తానని వీడియో తీసి ఇన్‌‌‌‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న రవి.. వీడియోను డిలీట్ చేసి పరారైనప్పటికీ, పోలీసులు టెక్నికల్ ఆధారాలతో బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఉప్పల్ స్టేడియం వంటి ప్రదేశాల్లో కూడా ఇతడు ఇలాగే పోలీస్ వేషధారణతో వీడియోలు తీసినట్లు గుర్తించారు. నిందితుడిపై పోలీసులు చీటింగ్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.