- ఖరీఫ్‌కు ముందే గిరిజన రైతులపై నకిలీల వల
- పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి
- ఏటా కోట్లలో మాఫియా దందా.. నష్టాల్లో రైతులు
ఆసిఫాబాద్, వెలుగు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే నకిలీ పత్తి విత్తనాల మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాలే టార్గెట్‌గా రైతులను నిండా ముంచుతున్నారు. పక్క రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర నుంచి నిషేధిత, నకిలీ, లూస్ పత్తి విత్తనాలను తెప్పించి స్థానిక ఏజెంట్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న దళారులు రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. “ఎన్ని ఎకరాలు? విత్తనం ఎంత కావాలి? ఇంటికే పంపిస్తాం” అంటూ రైతుల వద్దకే వెళ్లి దళారులు ఆర్డర్లు తీసుకుంటున్నారు. కంపెనీ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదని మాయమాటలు చెప్తూ.. ముందే బుకింగ్ చేసుకోకపోతే విత్తనాలు దొరకవని భయపెడుతూ అమాయక రైతులను ఉచ్చులోకి లాగుతున్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దందా
ఆసిఫాబాద్జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాంతాలు టార్గెట్ గా నకిలీ విత్తనాల దందా సాగుతోంది. కౌటాల, బెజ్జూర్, సిర్పూర్(టి), దహెగాం, సిర్పూర్(యు), కెరమెరి, జైనూర్, లింగాపూర్, పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి మండలాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. పోడు సాగు చేసుకునే గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు.
దళారులు గ్రామాల్లో స్థానిక యువకులను ఏజెంట్లుగా పెట్టుకుని విత్తనాల విక్రయాలు చేస్తున్నారు. రైతుల ఫోన్ నంబర్లు, సాగు వివరాలు సేకరించి నేరుగా సంప్రదిస్తున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులతోనూ చేతులు కలిపి రైతులకు అప్పుల సాకు చూపి నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పంట దిగుబడి రాకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు.
పోలీసుల దాడులు.. అయినా తగ్గని దందా..
ఇటీవల లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ నెల 22న సిర్పూర్(యు)లో నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం 5.45 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 152 ప్యాకెట్లలో సుమారు 68 కిలోల పత్తి విత్తనాలు లభించాయి. నిందితుడు నైతం జంగు ఇంటి వద్ద మరో 1100 ప్యాకెట్లలో 4.90 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ ఈ మాఫియా మాత్రం కొత్త మార్గాల్లో దందా కొనసాగిస్తోంది. రైతులు మంచి, నకిలీ విత్తనాలను గుర్తించలేకపోతుండడం మాఫియాకు కలిసివస్తోంది. గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు.. నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులు ఏటా మోసపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి రైతుల్లో అవగాహన పెంచి, వారిని అప్రమత్తం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు
జిల్లాలో నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్న విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనాలి. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు, లేదా డయల్ 100కు తెలియజేయాలి. -నితికా పంత్, ఎస్పీ, ఆసిఫాబాద్
