నాగ్​పూర్ నుంచి తెలంగాణకు నకిలీ పత్తి విత్తనాలు

నాగ్​పూర్ నుంచి తెలంగాణకు  నకిలీ పత్తి విత్తనాలు

ఎల్ బీనగర్, వెలుగు : మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి తెలంగాణకు నకిలీ పత్తి విత్తనాలను తీసుకొస్తున్న ఇద్దరిని ఎల్ బీనగర్ ఎస్ వోటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఎల్ బీ నగర్ లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ఏపీలోని పల్నాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు(29) చాలా కాలంగా నాగ్ పూర్​లో ఉంటున్నాడు.  కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ప్రసన్న కుమార్(42) యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో నవతా ఆగ్రో పత్తి విత్తనాలు,ఫెర్టిలైజర్ పేరిట షాప్ నడుపుతున్నాడు.

 అతడికి చౌటుప్పల్ లోనే గోడౌన్ కూడా ఉంది. ప్రసన్న కుమార్ దుకాణానికి రవీంద్ర కుమార్ నాగ్ పూర్ నుంచి పత్తి విత్తనాలు సప్లయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఇటీవల నకిలీ పత్తి విత్తనాలను అమ్మడం ప్రారంభించారు. నాగ్ పూర్ నుంచి వచ్చిన నకిలీ పత్తి విత్తనాలను ప్రసన్న కుమార్ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నర్సింహులుకు పంపేవాడు. ఇలా ముగ్గురు కలిసి తెలంగాణ, ఏపీలో నకిలీ విత్తనాల దందాను కొనసాగిస్తున్నారు. 

గురువారం ఎల్ బీనగర్ ఎస్ వోటీ, చౌటుప్పల్ పోలీసులు, వ్యవసాయ అధికారులతో  కలిసి పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో నకిలీ పత్తి విత్తనాలను కారులో తీసుకొస్తున్న రవీంద్రబాబు, ప్రసన్నకుమార్ ను  అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.70 లక్షల విలువైన 22 టన్నుల నిషేధిత స్ఫురియోస్ నకిలీ పత్తి విత్తనాలు(బీటీ3)లతోపాటు కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.