వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం.. పాలమూరులో ప్రత్యేక ప్రజావాణి

వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం.. పాలమూరులో ప్రత్యేక ప్రజావాణి
  • కలెక్టర్​ విజయేందిర బోయి ఆధ్వర్యంలో నిర్వహణ
  • ప్రతి నెల మొదటి బుధవారం వినతుల స్వీకరణ

మహబూబ్​నగర్, వెలుగు:వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు మహబూబ్​నగర్​ కలెక్టర్​ విజయేందిర బోయి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా మొదటి బుధవారం క్రమం తప్పకుండా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. 

ఈ మేరకు గత బుధవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి సారి నిర్వహించిన కార్యక్రమంలో 30 అప్లికేషన్లు రాగా.. అందులో దివ్యాంగులు, సీనియర్​ సిటిజన్​ల నుంచి పింఛన్లు మంజూరు చేయించాలని ఎక్కువ అప్లికేషన్లు ఇచ్చారు. ఈ అప్లికేషన్లను సంబంధింత శాఖల ఆఫీసర్లకు రెఫర్​ చేయగా.. త్వరలో వీరికి పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇబ్బందులను గుర్తించి..

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్​కు వివరించేందుకు వస్తుండగా.. ప్రతి వారం కనీసం 60 నుంచి 100 మంది వరకు వివిధ సమస్యలపై అర్జీలు అందజేస్తున్నారు. వీరిలో దివ్యాంగులు, వయోవృద్ధులు కూడా ఉంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు వీరు క్యూ లైన్​లో గంటల తరబడి వెయిట్​ చేస్తున్నారు. సమస్యను వెంటనే కలెక్టర్​కు దృష్టికి తీసుకురావాలనే తపనతో ముందుగానే కలెక్టరేట్​కు చేరుకుంటున్నా.. అప్పటికే ఉన్న క్యూ లైన్​ చూసి చాలా మంది గంటల తరబడి వేచి ఉండలేక సమస్య చెప్పుకోకుండానే వెనుదిరుగుతున్నారు. 

మరో వైపు జిల్లా కేంద్రం శివారులో కలెక్టరేట్​ ఉండడంతో అంత దూరం రాలేక మరికొందరు తమ సమస్యలను కూడా చెప్పుకోవడం లేదు. అయితే కొందరు మాత్రం ఉదయం 8 గంటలకే ప్రజావాణికి వచ్చి కలెక్టర్​ను కలిసి సమస్యను వివరించేంత వరకు తిరిగి వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఒంటరిగా వస్తున్న కొందరు సీనియర్​ సిటిజన్లు, దివ్యాంగులు ఆకలి, దప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కలెక్టర్​.. దివ్యాంగులు, సీనియర్​ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు.

 ప్రతి నెలా మొదటి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్లాన్​ చేశారు. దివ్యాంగులు, సీనియర్​ సిటిజన్లకు వీలుగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్​కు సమీపంలో ఉన్న అర్బన్​ తహసీల్దార్​ ఆఫీస్​లో ఈ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన సీనియర్​ సిటిజన్లు, దివ్యాంగులు తమ సమస్యలపై ఈ ప్రజావాణిలో వినతులు అందజేయవచ్చు. వినతులను కలెక్టర్​తో పాటు అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవో ఇతర ఉన్నతాధికారులు స్వీకరిస్తారు. అప్లికేషన్లను పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

గతంలో మండల స్థాయి​కమిటీలు

సీనియర్​ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏడాది కింద మండల స్థాయి కమిటీలను వేశారు. కమిటీలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏపీఎం, బ్యాంక్  మేనేజర్, ఎస్సై, ఉమెన్​ అండ్​ చైల్డ్  వెల్ఫేర్​ ఆఫీసర్లు ఉంటారు. వయోవృద్ధులను వారి పిల్లలు హింసించినా, పోషించకపోయినా, ఇబ్బందులు పెట్టినా.. బాధితులు ఈ కమిటీని ఆశ్రయిస్తే.. స్పందించి వారికి కౌన్సెలింగ్​ ఇస్తారు. అలాగే వయోవృద్ధులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కమిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ ఈ కమిటీ ఆ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆర్డీవో ఆధ్వర్యంలో ట్రిబ్యునల్​ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. అక్కడా పరిష్కారం లభించకపోతే.. కలెక్టర్​ ఆధ్వర్యంలో అఫిలెటివ్​ ట్రిబ్యునల్​ను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఐదు డిపార్ట్​మెంట్లే కీలకం..

వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణిలో ప్రధానంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలనే వినతులు వస్తున్నాయి. అయితే కలెక్టర్​ ఈ రెండు వర్గాలకు కీలకంగా ఉన్న డీఆర్డీవో, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్​, రెవెన్యూ, ఉమెన్​ అండ్​ చైల్డ్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్లను ప్రత్యేక ప్రజావాణిలో భాగస్వామ్యులను చేశారు. వీరు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం అందించనున్నారు. అలాగే గతంలో వివిధ మండలాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు తమ సమస్యలపై ఆర్జీలు పెట్టుకున్నా.. సమస్య పరిష్కారం కాకపోతే ఈ ప్రత్యేక ప్రజావాణిలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.