మంచుకొండ లిఫ్టు రెడీ!.. చెరువులకు చేరుతున్న సాగర్​ జలాలు

మంచుకొండ లిఫ్టు రెడీ!.. చెరువులకు చేరుతున్న సాగర్​ జలాలు
  • మండుటెండల్లోనూ జలకళ 
  • రూ.66.33 కోట్లతో నిర్మాణ పనులు
  • కొనసాగుతున్న డిస్ట్రిబ్యూటరీ పైప్​ లైన్ ​పనులు 
  • సంతోషం వ్యక్తం చేస్తున్న రఘునాథపాలెం రైతులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి నీటి కరువు తీరింది. పక్కనే కృష్ణా జలాలు పారుతున్నా ఇన్నేండ్లుగా చుక్క నీరు కూడా తమ పొలాలకు అందడం లేదన్న రైతుల ఆవేదనకు చెక్​ పడింది. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే భూముల్లో ఇప్పుడు నాగార్జున సాగర్​జలాలు సందడి చేయనున్నాయి. రూ.66.33 కోట్లతో సంక్రాంతి టైంలో శంకుస్థాపన చేసిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఫలాలు అందుతున్నాయి. 

పైపుల ద్వారా నీళ్లు వస్తుండడంతో ఎండాకాలంలోనూ చెరువుల్లో జలకళ కనిపిస్తోంది. 9 కిలోమీటర్ల ప్రధాన పైప్​లైన్​ నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు నిర్వహించిన ట్రయల్​రన్​సక్సెస్ ​అయ్యింది. వారం రోజులుగా ఒక మోటార్​ నడుస్తుండగా, చెరువులను నింపుతున్నారు. ఆ నీరు చైన్​లింక్​ ద్వారా కింది చెరువులకు చేరుతున్నాయి. రేగులకుంట చెరువు నుంచి నీరు సర్ ప్లస్ అయి నల్లకుంట చెరువు, మల్లెపల్లికి చేరుకుంటున్నాయి. మరో రెండ్రోజుల్లో మస్తాని కుంటకు నీళ్లివ్వనున్నారు. ఆ చైన్​లింక్​లో మరిన్ని చెరువులు నిండనున్నాయి. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ పైప్​ లైన్​పనులు జరుగుతుండగా, మరో రెండు నెలల్లో వంద శాతం పనులు పూర్తయ్యేలా అధికారులు ప్లాన్​చేశారు. 50 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్​ లైన్​ కు గాను ఇప్పటివరకు రెండున్నర కిలోమీటర్ల మేర వర్క్​కంప్లీట్ అయ్యింది. రైతుల భూముల్లోంచి దాదాపు 10 అడుగుల లోతు తవ్వి, పైప్​ లైన్ వేస్తున్నారు.

100 రోజుల్లోనే ప్రధాన పైప్​ లైన్

రఘునాథపాలెం మండలంలో మొత్తం 36 చెరువులకు ఈ ఎత్తిపోతల ద్వారా నీళ్లు నింపనున్నారు. దాదాపు 4 వేల ఎకరాల్లో సాగు నీరందించేందుకు అవకాశం ఉంటుంది. వి.వెంకటాయపాలెంలోని సాగర్​ కాల్వ డీప్​కట్ దగ్గర మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ఈ పథకాన్ని చేపట్టారు. 450 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లను బిగించి, ఒక్కో దాని ద్వారా 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మంచుకొండ గుట్ట దగ్గర అవుట్ లేట్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నాలుగు వైపులా డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువులకు నీటిని తరలిస్తారు. 

రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ను అప్పగించారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో 100 రోజుల్లోనే ప్రధాన పైప్​ లైన్​నిర్మాణం పూర్తి చేసి, ట్రయల్ రన్ ​నిర్వహించారు. పంటల సాగు సమయం మొదలైతే రైతుల భూముల్లోంచి పైప్​ లైన్​నిర్మాణ పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉండడంతో వేసవిలోనే స్పీడ్ గా వర్క్​ కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ పథకానికి అవసరమైన మూడు మోటార్ల రాక ఆలస్యం కావడంతో ప్రస్తుతానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం తెప్పించిన మోటార్ ను బిగించి ట్రయల్ రన్​ ను సక్సెస్​ చేశారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కూడా పూర్తయ్యేలోగా మూడు కొత్త మోటార్లు బిగించి, ఎత్తిపోతల పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్లాన్​చేస్తున్నారు. 

డిస్ట్రిబ్యూటరీ పనులను పరిశీలించిన తుమ్మల

మంచుకొండ ఎత్తిపోతల పథకంలో భాగంగా రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండా దగ్గర జరుగుతున్న గ్రావిటీ 5 డిస్ట్రిబ్యూటరీ పనులను శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. బావోజితండా దగ్గర రేగులకుంట చెరువు సందర్శించి, అక్కడికి చేరుకున్న సాగర్​ జలాల్లో పూలు జల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధికంగా ఆయకట్టు సాగయ్యే పనులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. రైతుల సహకారంతో పైప్ లైన్ వేయడం పూర్తి చేస్తున్నామని, రాబోయే వానాకాలం పంట సీజన్ నుంచి మంచుకొండ ఎత్తిపోతల పథకం క్రింద సాగు నీరు సరఫరా చేస్తామని అన్నారు. మంత్రి వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు పాల్గొన్నారు.

ఇకపై రెండు పంటల ఇబ్బంది లేదు

నాకు చెరువు శిఖం కింద మూడెకరాల భూమి ఉంది. చెరువులో నీళ్లుంటే పంట వేసుకునే అవకాశం ఉండేది. వర్షాలు లేక చెరువు అడుగంటితే పంటపై ఆశలు వదిలేసుకునేవాళ్లం. ఇప్పుడు సాగర్​నీళ్లు అందుతున్నాయి కాబట్టి ఇకపై ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకునేందుకు ఇబ్బంది ఉండదు. –  బానోతు మంగిలాల్, రాములు తండా, రఘునాథపాలెం మండలం