సర్కార్ స్కూళ్లలో సమ్మర్ క్యాంపులు

సర్కార్ స్కూళ్లలో సమ్మర్ క్యాంపులు
  • 6 నుంచి 9 క్లాస్ స్టూడెంట్స్ కు యోగా, ఆర్ట్, స్పోర్ట్స్ లో శిక్షణ 
  • సామాజిక అంశాలపై స్టూడెంట్స్ మధ్య డిబేట్
  • ఒక్కో స్కూల్​కు రూ.50 వేలు కేటాయింపు

యాదాద్రి, వెలుగు :కాంగ్రెస్​ ప్రభుత్వం స్టూడెంట్స్​లో మేథాశక్తిని పెంచేందుకు సర్కారు స్కూళ్లలో సమ్మర్​ క్యాంపులు నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన స్కూల్స్ లో​ స్టూడెంట్స్​కు వివిధ కేటగిరీల్లో 15 రోజులపాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. విద్యావ్యవస్థలో పాఠశాల విద్య ప్రాముఖ్యం ఎక్కువ. ఆరు నుంచి పదో తరగతి చదివే స్టూడెంట్స్​ను సరైన రీతిలో చక్కదిద్దితే వారిలో వివిధ రంగాలపై అభిరుచి పెరగడంతోపాటు ప్రతిభా పాటవాలు నెలకొనడానికి అవకాశం ఉంటుంది. 

ఇంటర్, డిగ్రీ ఆపై చదివే సమయానికి తమకంటూ లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. అందుకే తెలంగాణ సర్కారు.. పాఠశాల విద్యపై దృష్టి సారించింది. వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా సమ్మర్​క్యాంపులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్​కు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది. యాదాద్రి జిల్లాలోని కస్తూర్బా స్కూల్లో ఇప్పటికే సమ్మర్​క్యాంపు ప్రారంభం కాగా, వంద మంది స్టూడెంట్స్ క్యాంపులో పాల్గొంటున్నారు. జడ్పీ హైస్కూల్స్​లో ఈనెల 15 నుంచి 31 వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించనుంది. 

50 స్కూల్స్.. 8,252 మంది స్టూడెంట్స్..

సమ్మర్​క్యాంపుల నిర్వహణ కోసం యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 50 స్కూల్స్​ను ఎంపిక చేశారు. ఒక్కో స్కూల్​లో 60 మంది నుంచి 350 మంది స్టూడెంట్స్​వరకు వివిధ విభాగాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో మొత్తంగా 8,252 మంది స్టూడెంట్స్​కు ట్రైనింగ్​ఇవ్వనున్నారు. ఇందులో ఆరో తరగతి స్టూడెంట్స్​1,677 మంది, ఏడో తరగతి 1,825 మంది, ఎనిమిదో తరగతి 2,262 మంది, తొమ్మిదో తరగతి స్టూడెంట్స్​2,488 మందికి ట్రైనింగ్​ఇవ్వనున్నారు. ప్రతి 50 మంది స్టూడెంట్స్​కు పీఈటీ సహా ఒక్కో ట్రైనర్​ చొప్పున 170 మందిని ఏర్పాటు చేస్తున్నారు. 

ఒక్కో స్కూల్​కు రూ.50 వేలు..

సమ్మర్​క్యాంపుల నిర్వహణ కోసం ఒక్కో స్కూల్​కు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం బడ్జెట్​కేటాయించింది. ఈ అమౌంట్​తో ఇండోర్ గేమ్స్​కు అవసరమైన వాటిని కొనుగోలు చేయడంతోపాటు ట్రైనింగ్​కు వచ్చే స్టూడెంట్స్​కు పాలు, స్నాక్స్​ అందిస్తారు. అదేవిధంగా స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రైనర్స్​కు గౌరవ వేతనంగా రూ.వెయ్యి చొప్పున అందిస్తారు. 

యోగా, ఇండోర్ గేమ్స్, డిబేట్..​

స్టూడెంట్స్​కు మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించడం కోసం యోగా, సూర్య నమస్కారాలతోపాటు మెడిటేషన్​లో ట్రైనింగ్ ఇస్తారు. ఇండోర్ గేమ్స్​అయిన చెస్, క్యారమ్, డ్రాయింగ్, పేపర్​క్రాప్ట్ తయారీ సహా భారతీయ కళల్లో ట్రైనింగ్​ఇస్తారు. గార్డెనింగ్, సీడ్​బాల్​వంటివి తయారు చేయిస్తారు. వీటితో చందమామ కథలు చదివించడం, రాయించడం, తెలుగు, ఇంగ్లిష్​ భాషా పరిజ్ఞానం పెంపొందేలా చేస్తారు. సామాజిక అంశాలపై స్టూడెంట్స్​మధ్య డిబేట్​జరిపిస్తారు.

స్టూడెంట్స్​ మేథాశక్తి పెంపొందించడానికే 

స్టూడెంట్స్​లో మేథాశక్తి, ఏకాగ్రత, నైపుణ్యం పెంపొందించడానికి సమ్మర్​క్యాంపులు నిర్వహిస్తున్నాం. సామాజిక అంశాలపై డిబేట్ ​జరిపించడం వల్ల స్టూడెంట్స్​లో వాక్చాతుర్యం పెంపొందుతుంది. కథలు చదివించడం, రాయించడం వల్ల రచనలపై ఆసక్తి పెరుగుతుంది. తద్వారా లక్ష్యాలు నిర్ధేశించుకోగలుగుతారు. - సత్యనారాయణ, డీఈవో, యాదాద్రి