నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీమ్​లు చేపట్టిన తనిఖీల్లో 78 క్వింటాళ్ల నకిలీ కాటన్‌ సీడ్స్‌ పట్టుబడ్డాయి. క్వింటాళ్ల కొద్దీ నకిలీ సీడ్స్‌ దొరకడంతో ఇప్పటికే ఎన్ని వేల  క్వింటాళ్ల నకిలీ విత్తనాలు గ్రామాలకు చేనరాయోనని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

వ్యవసాయ శాఖ నజర్ 

వ్యవసాయశాఖ నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టింది. ఇటీవల ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి  నకిలీ విత్తనాలు, హెచ్​టీ కాటన్ సీడ్స్ అరికట్టాలని ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చే నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్​ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా నకిలీల్లో పత్తి విత్తనాలే ఎక్కువగా మార్కెట్​లోకి వస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం బీటీ-–3 రకం విత్తనాలపై నిషేధం విధించింది. అయినప్పటికీ వ్యాపారులు బీటీ-–3, హెచ్​టీ రకం పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. 

సీజన్ ప్రారంభం కాకముందే వ్యాపారులు గ్రామాల్లో రైతులతో మాట్లాడుకుని నిషేధించిన పత్తి రకాలను అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వ్యవసాయశాఖ ఫీల్డ్​ లెవెల్​ సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించి ప్రత్యేక బృందాలతో దాడులు చేస్తున్నది. బీటీ-–3పై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతులు నష్టపోకుండా ముందస్తుగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని అగ్రికల్చర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. విత్తన వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ టీమ్​లతో దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్​లు పెట్టేందుకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఐదు జిల్లాల్లో టాస్క్​ఫోర్స్ దాడులు

టాస్క్​ఫోర్స్​ టీమ్‌లు ఇటీవల ఐదు జిల్లాల్లో దాడులు నిర్వహించగా ఏడు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. 1.19కోట్ల విలువైన 78 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్​ చేశారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్టు చేశారు. కాగా, ఇందులో ఎక్కువ మొత్తంలో కాటన్ సీడ్స్ ఉండడం గమనార్హం. కొందరు అనధికారికంగా అమ్ముతున్నారనే సమాచారంతోనే ఈ దాడులు జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో వావాహనాల తనిఖీల్లో పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.  

అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అత్యధికంగా 35 క్వింటాళ్ల నిషేధిత హెచ్​టీ కాటన్ సీడ్స్ పట్టుబడ్డాయి. నారాయణపేట జిల్లాలో 8 క్వింటాళ్లు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని శామీర్​పేట్​లో 12 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, భీమినిలో 0.04 టన్నుల స్పోర్ సీడ్​ను సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్​లో 15.56 క్వింటాళ్లు, ఇదే జిల్లా దౌల్తాబాద్​లో 7.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, యాలలో 0.3 క్వింటాళ్ల సీడ్స్​ను సీజ్​ చేశారు.

తనిఖీలకు బార్ కోడ్, క్యూఆర్ కోడ్..

బార్ కోడెడ్, క్యూ ఆర్​ కోడెడ్ పద్ధతి ద్వారా విత్తనాల తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్, జీఐఎస్, జియో ట్యాగింగ్ వంటి టెక్నాలజీని వాడి మార్కెట్లో నకిలీ విత్తనాల సరఫరాను నిరోధించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిపై ప్రస్తుత విత్తన చట్టం ప్రకారం చీటింగ్ కేసు, జరిమానాతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని నిర్ణయించారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై  ప్రభుత్వం సీరియస్​గా వ్యవహరించాలని నిర్ణయించడంతో వ్యవశాయ శాఖ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. రైతులకు నష్టం కలిగించే విత్తనోత్పత్తిదారులపై చర్యలు తీసుకోవాలని, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ దాడులు నిర్వహించాలని, సరైన సమయంలో రైతుకు విత్తనాలు అందించాలని నిర్ణయించారు. విత్తనాలపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నారు.  

పత్తి విత్తనాల కోసం ముందస్తు ఏర్పాట్లు

రాష్ట్రంలో పత్తి పంట సాగు ఈ ఏడాది మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. గత సీజన్​లో పత్తి మద్దతు ధర పెరగడంతో ఈ ఏడాది 60 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేసే అవకాశంముందని ప్రాథమిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ వానాకాలం అంచనాలకు అనుగుణంగా కాటన్ సీడ్ ప్యాకెట్లను విత్తన కంపెనీలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. బీటీ–-1, బీటీ–-2 రకాలను అందుబాటులో ఉంచాలని, కోటి 20 లక్షలకు పైగా 450 గ్రాముల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని బీటీ కాటన్​ సీడ్ కంపెనీలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌ రావు ఆదేశించారు.