జడ్చర్ల, వెలుగు : నకిలీ నోట్లు చలామణి చేస్తున్న వారిని జడ్చర్ల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్ మీడియాకు వెల్లడించారు. జడ్చర్ల పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్లు పట్టణంలోని సరస్వతీనగర్ కాలనీలోని ఓ కిరాణ దుకాణం వద్ద నకిలీ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని పద్నాలుగు రూ. 500, పదమూడు రూ. 200ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు మైనర్లు కారులో తిరుగుతూ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారని నిందితులు చెప్పడంతో... వారిని సైతం పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ నిందితుడు పట్టుబడగా.. మరో యువకుడు పరార్ అయ్యాడు. వీరి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు
