‘నిమ్స్​లో సర్జన్​ను.. నిమిషాల్లో రోగం నయం జేస్త’

‘నిమ్స్​లో సర్జన్​ను.. నిమిషాల్లో రోగం నయం జేస్త’
  • మహిళను నమ్మించి లాడ్జికి రప్పించిన ఫేక్ డాక్టర్
  • మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి 10 గ్రాముల గోల్డ్, రూ.25 వేలు చోరీ
  •  గోపాలపురం పీఎస్ పరిధిలో ఘటన

సికింద్రాబాద్, వెలుగు: రోగం నయం చేస్తానని నమ్మించిన ఓ ఫేక్ డాక్టర్ మహిళకు మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి బంగారు గొలుసు, డబ్బు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన గోపాలపురం పీఎస్ పరిధిలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఈస్ట్​గోదావరి జిల్లాకు చెందిన నూకల సుజాత(50) బతుకుదెరువు కోసం చాలాకాలం కిందట సిటీకి వచ్చి కేపీహెచ్​బీ పరిధి ఎల్లమ్మబండలో ఉంటోంది. స్థానిక బీజేఆర్ కాలనీలో టీ షాప్ నడుపుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల పెండ్లి ఉండటంతో ఈ నెల 2న ఆమె సికింద్రాబాద్​ స్టేషన్​లో గోదావరి ఎక్స్​ప్రెస్ ఎక్కింది. అదే రైలులో ఆమె పక్కన కూర్చున్న ఓ వ్యక్తి సుజాతతో మాటలు కలిపాడు.

 తాను పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్​లో సర్జన్​గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. దీంతో సుజాత తనకున్న అనారోగ్య సమస్యలను అతడితో చెప్పింది. తాను చెప్పిన ప్లేస్​కు వస్తే  నిమిషాల్లో రోగం నయంజేస్తానని నమ్మించి సదరు వ్యక్తి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. బంధువుల పెండ్లి చూసుకుని ఈ నెల 6న రాత్రి సుజాత పిఠాపురం నుంచి హైదరాబాద్​కు బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఆమె రైలులో ఉండగానే ఫేక్​డాక్టర్ ఫోన్ చేశాడు. 8.30 గంటలకు రైలు దిగగానే స్టేషన్​కు వచ్చి కలిశాడు. దగ్గరలో ఉన్న లాడ్జిలో రూమ్​ తీసుకున్నానని.. అక్కడికి వస్తే మందులు ఇస్తానని చెప్పాడు. రెజిమెంటల్​బజార్ గురుద్వారా వెనుక ఉన్న ఓ లాడ్జిలోని రూమ్​కు సుజాతను తీసుకెళ్లాడు. 

కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోవాలని చెప్పాడు. సుజాత ఆ ట్యాబ్లెట్లు మింగిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయింది. వెంటనే సదరు వ్యక్తి ఆమె బ్యాగ్​ను చెక్ చేసి అందులో ఉన్న రూ.25 వేల క్యాష్, ఆమె ఒంటిపై ఉన్న 10 గ్రాముల గోల్డ్ చైన్, సెల్​ఫోన్ తీసుకుని పారిపోయాడు. మధ్యాహ్నం 12.30గంటలకు సుజాతకు మెలకువ రాగా.. రూమ్​లో ఎవరూ కనిపించలేదు. బ్యాగ్​లోని డబ్బు, బంగారు గొలుసు, సెల్​ఫోన్ మాయమైనట్లు గుర్తించింది. వెంటనే ఫేక్​డాక్టర్​పై గోపాలపురం పీఎస్​లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు అనే పేరుతో ఉన్న ఆధార్ కార్డును చూపించి నిందితుడు లాడ్జిలో రూమ్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేక్ డాక్టర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.