- 60 సంచులు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
ఆదిలాబాద్ టౌన్(జైనథ్), వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఎరువులను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆదిలాబాద్జిల్లా జైనథ్ పోలీసులు నిందితులను పట్టుకున్నాడు. సీఐ జి.శ్రావణ్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గనూరిపల్లికి చెందిన ఎవురి కృష్ణయ్య తన స్నేహితులతో కలిసి తమ జిల్లాలో లైసెన్స్‌తో ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఎరువులను అమ్ముతున్నాడు. అధిక లాభాల కోసం ‘జై కిషన్ ఆర్గానిక్ ఆర్గో టెక్నాలజీస్’ పేరుతో నకిలీ ఎరువులను తీసుకువచ్చి జైనథ్ మండలంలోని రైతులను లక్ష్యంగా చేసుకొని గ్రామానికి చెందిన బట్ట మహేందర్ ద్వారా గత రెండు నెలలుగా అమ్ముతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు జైనథ్ మండలం కంట గ్రామంలో, చాందాకు వెళ్లే రహదారి ప్రాంతాల్లో దాడులు చేసి నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు సుమారు 400 బ్యాగులు అమ్మినట్లు గుర్తించామని సీఐ తెలిపారు. కృష్ణయ్య, మహేందర్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 60 నకిలీ ఎరువుల బస్తాలు, ఒక కారు, బైక్, మొబైల్స్, బిల్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ధ్రువీకరించిన డీలర్ల వద్ద మాత్రమే రైతులు ఎరువులు కొనాలని సీఐ సూచించారు.
