
మోటివేషనల్ వీడియోలతో పాపులర్
అతడి వయసు 20 ఏళ్లు. నూనుగు మీసాలు. వచ్చి రాని గడ్డం. ఎప్పుడూ టిప్ టాప్ సూటు, రేబాన్ కళ్లజోడుతో కనిపిస్తాడు. త్రీస్టార్ కారులోనే బయటకు వస్తాడు. రక్షా రక్షా అంటూ తన వద్దకు వచ్చే నేరగాళ్లకు నేనున్నానంటూ అభయమిస్తాడు. వాళ్ల నుంచి లక్షలకు లక్షలు పిండుకుంటాడు. ఫ్యాషన్ షోలకు వెళతాడు. గాలా పార్టీల్లో స్టెప్పులేస్తాడు. 20 ఏళ్లకే తాను ఐపీఎస్ ఎలా అయ్యాడో చెబుతాడు. తనను తాను అభయ్ మీనాగా పరిచయం చేసుకుంటాడు. ఢిల్లీ కేడర్‌లో ఏసీపీగా పని చేస్తున్నానని చెప్పుకుంటాడు. ఓ కారును కొనుగోలు చేసి ప్రభుత్వ వాహనంగా నమ్మించాడు. ఇది చూసి చాలాసార్లు మమూలు పోలీసులు అతడికి సెల్యూట్ కొట్టారు. వాళ్లకు అతడు సర్టిఫికెట్లు, అవార్డులు అందజేశాడు కూడా. తరచూ సివిల్స్, ఐఐటీ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి సోషల్ మీడియాలో టిప్స్ పోస్టు చేస్తుంటాడు. దీంతో సోషల్ మీడియాలో అతడికి బోలెడు మంది వీరాభిమానులు తయారయ్యారు. కానీ అతనో ‘నకిలీ’ ఆఫీసర్.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంటర్ ఫెయిలైన స్టూడెంట్!
పట్టించిన ‘త్రి స్టార్’
ప్రారంభ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్లకు ఆరంభంలోనే ‘త్రీ స్టార్’ సింబల్ కారు రాదు. డీజీ లేదా ఏడీజీ రేంజ్ ఆఫీసర్‌కు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అలాంటిది 20 ఏళ్ల కుర్రాడు త్రీ స్టార్ కారులో తిరగడం ఢిల్లీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) పోలీసుల కంట పడింది. అసలు విషయం తెలుసుకునేందుకు అతడు ఉంటున్న అపార్టుమెంటుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అతడి ఐడీ ప్రూఫులు అడిగారు. తనకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అంటూ మీనా భయపెట్టబోయాడు. చివరకు మీనా చూపిన ఓ ఐడీ కార్డులో బ్రాంచ్‌ను ‘Branche’గానూ, క్యాపిటల్‌ను ‘Capitol’ రాసి ఉండటాన్ని గమనించారు. నిజం చెప్పమని తమ స్టైల్లో అడిగారు. అసలు సంగతి చెప్పడంతో అరెస్ట్ చేశారు.