మంత్రికే ఫేక్ లెటర్.. మావోయిస్టుల పేరిట సీతక్కపై విమర్శలు

మంత్రికే ఫేక్ లెటర్.. మావోయిస్టుల  పేరిట సీతక్కపై విమర్శలు
  • తాము రాయలేదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్  పేరిట లేఖ 
  • రాసిందెవరు..? రాజకీయ కోణం ఉందా..?
  •  వాట్సాప్ గ్రూపుల్లోకి ఎలా వచ్చింది.. ఎవరు సర్క్యులేట్ చేశారు?
  • ఇంతకూ ఎవరు రాశారు..?  ఆరా తీస్తున్న పోలీసులు!


హైదరాబాద్: మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ.. ఆమెపై విమర్శలు చేస్తూ మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.  ఈ లేఖపై తాజాగా మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. మంత్రి సీతక్కపై ప్రకటన తాము చేయలేదని స్పష్టం చేసింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గత నెల  26న  మంత్రి సీతక్కపై వచ్చిన పత్రిక ప్రకటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్‌ క్లారిటీ ఇచ్చారు.

 ఆ లేఖలో సీతక్కను మహిళ అని కూడా చూడకుండా సిగ్గు పడాలంటూ పేర్కొనడం కొంత అనుమానాస్పదంగానే  కనిపించింది. జీవో 49 అంశాన్ని ప్రస్తావించారు. ఆదివాసీ బిడ్డగా, మాజీ నక్సలైట్‌గా ప్రాచుర్యం పొందిన మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో ఈవిధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరమని పేర్కొన్నారు. దీనిపై సీతక్క మీడియాతో మాట్లాడారు. ఇది మావోయిస్టులు రాసిన లేఖ కాదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ లేఖపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖ తాము రాయలేదని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులను మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదంటూ జూన్ 26న విడుదలైన ప్రకటనతో తమకు సంబంధం లేదని  పేర్కొన్నారు. దీంతో ఆ లేఖ రాసిందెవరు..? ఎలా మీడియాకు వచ్చింది. ఏయే వాట్సాప్ గ్రూపుల ద్వారా సర్క్యులేట్ అయ్యింది.. దీని వెనుక ఎవరున్నారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివాసీ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన సీతక్క గతంలో పీడిత జనాల పక్షాన పోరాటాలు చేశారు. ఆమెపై మావోయిస్టుల పేరిటే లేఖ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.