వ్యవసాయ శాఖలో నకిలీ ఆఫీసర్లు !

వ్యవసాయ శాఖలో నకిలీ ఆఫీసర్లు !
  • ఫేక్​ సర్టిఫికెట్లతో 2005 నుంచి కొలువులు
  • ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోని సర్కారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖలో నకిలీ అధికారులు దర్జాగా కొనసాగుతున్నారు.అగ్రికల్చర్‌‌ బీఎస్సీ చదవకుండానే దొంగ సర్టిఫికెట్లతో ఏండ్లుగా ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. ఇండియన్‌‌ కౌన్సిల్‌‌ ఫర్‌‌ అగ్రికల్చర్‌‌ రిసెర్చ్‌‌(ఐసీఏఆర్‌‌) గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో చదివిన వారినే ఎంపిక చేయాలనే  నిబంధన ఉన్నా.. అలాంటి గుర్తింపు లేని వర్సిటీల్లో కొనుకున్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు.ఈ బోగస్‌‌ అగ్రికల్చర్‌‌ అధికారులపై పలు ఫిర్యాదులు అందినా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. నెల కింద ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌‌ జయశంకర్ యూనివర్సిటీ విద్యార్థులు అగ్రికల్చర్‌‌ కమిషనర్​ ను  కలిసి ఫిర్యాదు చేశారు.విషయాన్ని గవర్నర్​ దృష్టికి కూడా తీసుకెళ్లారు.కమిషనర్‌‌కు ఫిర్యాదు చేసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనలకు విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి.ఏపీలో ఇలాంటి ఆరోపణలే రాగా అక్కడి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి.. నకిలీ అధికారులపై వేటు వేసింది.
 
2005 నుంచి బాగోతం
ఫేక్‌‌ సర్టిఫికెట్లతో అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగాలు పొందే బాగోతం 2005లోనే మొదలైంది. 2005  నుంచి 2012 వరకు నాలుగు సార్లు అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో నియామకాలు జరిగాయి.ఇదే సమయంలో నకిలీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందారు. 

దర్యాప్తు సంస్థలోనూ నకిలీ ఆఫీసర్​!
నకిలీ ఆఫీసర్ల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులతో గతంలో అగ్రికల్చర్​ విజిలెన్స్‌‌ వింగ్​ దర్యాప్తు చేపట్టినప్పటికీ  మధ్యలోనే వదిలేసింది.విచిత్రం ఏమిటంటే.. అగ్రికల్చర్‌‌ విజిలెన్స్‌‌ వింగ్​లోనూ ఇన్నాళ్లూ నకిలీ సర్టిఫికెట్‌‌తో ఉద్యోగం పొందిన అధికారి ఉండడంతోనే దర్యాప్తు ముందుకు సాగలేదని సమాచారం.తమపై ఉన్న అపవాదును తొలగించుకునే క్రమంలో ఆ వింగ్‌‌ ఇటీవల తమ టీమ్​లోని నకిలీ అధికారిని వేరే విభాగానికి  పంపించింది.
 
తవ్విన కొద్దీ బయట పడుతున్న బాగోతం
అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీల్లో అగ్రికల్చర్‌‌ బీఎస్సీ చదివి వేలాది మంది స్టూడెంట్స్‌‌ అగ్రి డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగాలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్నారు. అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో బోగస్‌‌ సర్టిఫికెట్ల బాగోతం తెలిసి విద్యార్థులే రంగంలోకి దిగారు. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించగా.. కొందరు అక్రమార్కులు దేశంలో ఎక్కడా లేని సాయిల్‌‌ సైకాలజీ చదివినట్లు కూడా సర్టిఫికెట్‌‌లో చూపించారు.ఐసీఏఆర్‌‌ అనుమతి లేని పలు వర్సిటీల్లో చదివినట్లు సర్టిఫికెట్లు వెలుగు చూశాయి.ఉత్తరప్రదేశ్​ ఆగ్రాలోని ఓ యూనివర్సిటీ నుంచి  ఎక్కువమంది సర్టిఫికెట్‌‌లో పొందినట్లు తేలింది. అదే యూనివర్సిటీలో అదే ఇయర్‌‌లో చదివినట్లు చూపిస్తున్న కొందరి సర్టిఫికెట్లలోనూ రిజిస్ట్రార్‌‌, వీసీల సంతకాలు కూడా వేరువేరుగా ఉన్నట్లు బయటపడింది.ఇలా దాదాపు 150మందికి పైగా అక్రమ మార్గాల్లో వ్యవసాయ శాఖలో చేరినట్లు సమాచారం.

ఇప్పటి వరకు ఇద్దరిపైనే వేటు
పది జిల్లాల్లో నకిలీ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో నిరుడు కేవలం నిజామాబాద్​ జిల్లాలోనే కలెక్టర్​ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.ఇక్కడ ముగ్గురు నకిలీ అధికారులను గుర్తించారు. ఇందులో కమ్మర్ పల్లి , భీంగల్​ మండలాల ఏవోలను సస్పెండ్​ చేశారు.మిగతా జిల్లాల్లో దర్యాప్తు సాగలేదు. రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా నకిలీ ఏవోలు ఉన్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలి
బోగస్‌‌ అధికారులు వ్యవసాయశాఖలో ఏండ్ల తరబడి కొనసాగుతున్నారు. కమిషనర్‌‌ రఘునందన్‌‌రావుకు ఫిర్యాదు చేసి నెల రోజులైనా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. నకిలీ అధికారులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి తొలగించాలి. నిరుద్యోగుల కోసం కొత్తగా నోటిఫికేషన్‌‌ ఇచ్చి నియామకాలు చేపట్టాలి.

- రుపావత్‌‌ హరి ప్రసాద్‌‌, అగ్రికల్చర్‌‌ స్టూడెంట్‌‌, ఎన్‌‌ఎస్‌‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు