పట్టా పాస్ బుక్ లు ఇప్పిస్తామని రూ.కోట్లలో వసూళ్లు!.. సొంతంగా ప్రింట్ చేసి ఒరిజినల్గా నమ్మించే యత్నం

 పట్టా పాస్ బుక్ లు ఇప్పిస్తామని  రూ.కోట్లలో వసూళ్లు!.. సొంతంగా ప్రింట్ చేసి ఒరిజినల్గా నమ్మించే యత్నం
  • ఆన్​లైన్​కాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు
  • కూసుమంచి పోలీసులకు బాధిత రైతు అంజిరెడ్డి ఫిర్యాదు
  • ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్టు ప్రచారం 

 ఖమ్మం/ కూసుమంచి, వెలుగు:  మిగులు భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్​ పుస్తకాలు ఇప్పిస్తామంటూ రూ.కోట్లలో డబ్బులు కొట్టేసిన ఓ ముఠాకు పోలీసులు చెక్​ పెట్టారు. కలర్​ ప్రింటింగ్ ప్రెస్​ ద్వారా నకిలీ పాస్​ పుస్తకాలను తయారు చేస్తున్న ఐదుగురిని ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీసీఎల్ఏలో తెలిసిన వాళ్లున్నారని, వారి ద్వారా ఒరిజినల్ పాస్​ బుక్ లు మంజూరు చేయిస్తామంటూ ఐదుగురు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేశారు. 

ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్​కర్నూలు సహా పలు జిల్లాల్లో ఇలా ఈ ముఠాకు డబ్బులు ఇచ్చి మోసపోయినట్టు తెలుస్తోంది. పాస్​ బుక్​లు అందుకున్న వారు ఆన్​ లైన్​ లో చెక్​ చేయగా వివరాలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన కళ్లెం అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 నకిలీ పాస్​ పుస్తకాలను రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరెవరు ఈ ముఠాలో ఉన్నారు, ఎంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 

భాగోతం బయటపడింది ఇలా.. 

కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన కళ్లెం అంజిరెడ్డికి నేలకొండపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. గతంలో బిల్ ముక్తాగా సాదాబైనామా కింద కొన్న 20 ఎకరాల భూమిని, ఆ తర్వాత వేరే వాళ్లకు ఎకరాల చొప్పున అమ్మేశారు. అందులో ఐదెకరాలు ఎక్కువగా ఉందంటూ, ఆ అదనపు భూమికి పాసు పుస్తకాలు చేయించుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కొత్త జీవన్​ రెడ్డి తనకు సీసీఎల్ఏలో తెలిసిన వాళ్లున్నారంటూ పాస్​ బుక్​ ఇప్పించేందుకు రూ.13.50 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. రెండు విడతల్లో అంజిరెడ్డి రూ.5 లక్షలు ఇవ్వగా, మిగిలిన డబ్బుల కోసం జీవన్​ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. 

నెలలు గడుస్తుండగా పని పూర్తి కాకపోవడం, డబ్బులతో జీవన్​ రెడ్డి జల్సాలు చేస్తుండడం, సొంతూరితో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పాస్​ బుక్​ ల కోసం జీవన్​ రెడ్డి ఇంటి చుట్టూ కొత్త వ్యక్తులు తిరుగుతుండడంతో అంజిరెడ్డికి అనుమానం వచ్చింది. గ్రామంలో ఎంక్వైరీ చేయగా 22 మంది నుంచి ఇలాగే రూ.1.25 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది. దీంతో రూ.5 లక్షలు తిరిగివ్వాలంటూ జీవన్​ రెడ్డిపై అంజిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల జక్కేపల్లికి చెందిన బాధితులు కొందరు విషయాన్ని ఇమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో పాటు కళ్లెం అంజిరెడ్డి కంప్లైంట్ ఇవ్వడంతో, పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. జీవన్​రెడ్డితో పాటు, దొంగ పాస్​ పుస్తకాలు తయారు చేయడంలో కీలకంగా ఉన్న ఐదుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. 

30 మందికి పైగా బాధితులు..!

జక్కేపల్లికి చెందిన కొత్త జీవన్​ రెడ్డి కొన్నేళ్ల కింద ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో సాయి గణేశ్​ నగర్​ లో నివాసం ఉండే కొండూరి కార్తీక్​ పరిచయమయ్యాడు. కార్తీక్ సొంతూరు మహబూబాబాద్​ జిల్లా గార్ల బయ్యారం.. ఇతని ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పారిపత్తి సాయి కుశాల్, కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన జక్కపల్లి వరప్రసాద్​, సారపాకలోని ఏకే ప్రింటింగ్స్​ యజమాని నందమూరి లక్ష్మణరావు పరిచయమయ్యారు. జీవన్​ రెడ్డి, కార్తీక్​, కుశాల్ కలిసి సీసీఎల్ఏలో పాస్​ బుక్​ ల కోసం చేసిన ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో సొంతంగానే ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 

సారపాకలోని ఏకే ప్రింటింగ్ ప్రెస్​ లో ఒరిజినల్ తరహాలోనే పాస్​ బుక్​ లను సీక్రెట్ గా ముద్రించారు. వాటినే ఒరిజనల్ పాస్​ బుక్​ లుగా నమ్మించారు. క్రమంగా ఒకరిద్వారా మరొకరు పరిచయాలు పెరగడంతో దాదాపు 8 జిల్లాల్లో 30 మందికి పైగా బాధితుల నుంచి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాస్​ బుక్​ లు ఆన్​ లైన్​ లో లేకపోవడం, భూ భారతిలో నమోదు కాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, మంగళవారం గంగబండతండా ఫ్లై ఓవర్​ సమీపంలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

వారి నుంచి ఒక మహింద్రా థార్​ కారు, ఒక ఎర్టిగా కారు, 10 దొంగ పట్టాదారు పాస్​ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు వసూలు చేసిన డబ్బులతో కొరివి సమీపంలో మూడెకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నిందితులను కోర్టు ద్వారా రిమాండ్​ కు తరలించామని, ఎంక్వైరీ కొనసాగుతుందని కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు.