బెట్టింగ్ డ్రామాతో 2 లక్షలు కాజేసిన స్నేహితులు

బెట్టింగ్ డ్రామాతో 2 లక్షలు కాజేసిన స్నేహితులు

రాజేంద్రనగర్‌: పోలీసులమని బెదిరించి డబ్బులు దోచుకున్న ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. పట్టుబడ్డ వారిలో ఓ హోంగార్డు కూడా ఉన్నాడు. మధుబాన్ కాలనీకు చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బత్తుల సుమన్‌(41), మెట్టుపల్లి ప్రశాంత్‌(21), కొగరి బాయ్‌ కుమార్‌ సాయి(28)  శ్రీనివాస్ స్నేహితులు.  శ్రీనివాస్ దగ్గర డబ్బులు కాజేద్దామని  బత్తుల సుమన్ ప్లాన్ వేశాడు. క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొనాలని శ్రీనివాస్ ను ఒత్తిడి చేశాడు. అయితే శ్రీనివాస్ తనకు ఆసక్తి లేదని చెప్పాడు. ఓ రోజు ఫోన్ చేసి క్రికెట్ ఆడే రెండు టీంలలో ఏది గెలుస్తుందో చెప్పాలన్నాడు. శ్రీనివాస్ మాట్లాడిన మాటలను రికార్డ్ చేశాడు సుమన్. ఆ తర్వాత మరికొందరితో కలిసి నాటకం ఆడాడు. అందరూ కలిసి పోలీసులమని 4 లక్షల 40 వేలు ఇవ్వాలని శ్రీనివాస్ ను బెదిరించారు. డబ్బులు ఇవ్వకుంటే బెట్టింగ్ ఆడుతున్నందుకు జైలుకు పంపిస్తామన్నారు. భయపడిన శ్రీనివాసరావు నిందితులకు మూడు విడతలుగా 2 లక్షల 40 వేల రూపాయలు ఇచ్చాడు. మిగిలిన 2 లక్షలు ఇవ్వాలని నిందితులు ఒత్తిడి చేస్తుండటంతో శ్రీనివాస్ కు అనుమానం కలిగింది. తన ఆడియో వారికెలా చేరిందని ఆరా తీశాడు. ఇదంతా తన ఫ్రెండ్ సుమన్ చేసిన కుట్రేనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుమన్ తో పాటు హోంగార్డు కట్టా వెంకటేశ్వరరావు, ప్రశాంత్, సాయికుమార్ ను అరెస్ట్ చేశారు.