ప్రభుత్వాస్పత్రిలో ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికెట్ కేసు..డేటా ఎంట్రీ ఆపరేటర్ పై దర్యాప్తు

ప్రభుత్వాస్పత్రిలో ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికెట్ కేసు..డేటా ఎంట్రీ ఆపరేటర్ పై దర్యాప్తు
  • కంప్యూటర్ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్.. 
  • డాక్టర్ సహా మరో ముగ్గురికి కలెక్టర్ నోటీసులు
  • తప్పుడు సర్టిఫికెట్ల కోసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు
  • ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల కోసం దొంగ సర్టిఫికెట్లు?

ఖమ్మంలోని శ్రీనివాస్​ నగర్​ కు చెందిన కుక్కల చరణ్​ రాజు కొంత కాలంగా ప్రభుత్వాస్పత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్​ గా పనిచేస్తున్నాడు. కండ్ల ముందే డబ్బులు ఇచ్చి సదరం క్యాంపుల్లో వైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్ తీసుకుంటుండడంతో చరణ్​ రాజుకు ఆశపుట్టింది. సర్టిఫికెట్ ఉంటే పెన్షన్​ తో పాటు, ఇతర బెనిఫిట్స్​ వస్తాయని దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వాస్పత్రిలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని, ఈ ఏడాది జూన్​ 25న మస్క్యులర్​ వీక్​ నెస్​ కారణంగా తనకు 75 శాతం వైకల్యం ఉందని పర్మినెంట్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఇతని రెండు కాళ్లు, చేతులు సరిగా పనిచేయడం లేదని పరీక్ష చేసిన డాక్టర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా నిర్ధారించారు. కాగా, ఫేక్​సర్టిఫికెట్ సృష్టించాడని వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి ఎంక్వైరీ చేయించారు. దీంతో తనకు ఎలాంటి వైకల్యం లేకుండానే సర్టిఫికెట్ పొందాడని తేలడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. చరణ్​రాజును విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీనియర్​ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడంతో పాటు, మరో ముగ్గురికి షోకాజ్​ నోటీసులు జారీచేశారు. 

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు:  దివ్యాంగులకు వైకల్యాన్ని నిర్థారించేందుకు నిర్వహించే సదరం(సాఫ్ట్ వేర్​అసెస్​మెంట్ ఆఫ్​ డిసేబుల్డ్ ఫర్​యాక్సెస్​రీహాబిలిటేషన్, ఎంపవర్​మెంట్)  క్యాంపులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ గా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్లు అయిన వారు కొందరు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మరికొందరు తప్పుడు మార్గంలో సదరం సర్టిఫికెట్లు పొందుతున్నారన్న విమర్శలున్నాయి.

 ట్రాన్స్​ ఫర్ల కోసం, ప్రమోషన్ల కోసం, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల కోసం రూ.30 వేల వరకు ఖర్చు చేసి మరీ బ్రోకర్ల ద్వారా సదరం సర్టిఫికెట్లు పొందుతున్నారని తెలుస్తోంది. సదరం క్యాంపుల్లో అక్రమాలపై గతం నుంచి ఆరోపణలు ఉండగా, ఇటీవల కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి చేయించిన ఎంక్వైరీతో మరోసారి ఫేక్​ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో సదరం క్యాంపుల నిర్వహణలో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. ప్రతినెలలో కనీసం ఐదు సదరం శిబిరాలు నిర్వహిస్తుండగా, ఒక్కో శిబిరానికి 100 నుంచి 150 మంది వరకు హాజరవుతున్నారు. 

సర్టిఫికెట్లు ఎవరికిస్తారంటే..!

చిన్నప్పటి నుంచి శారీరక వైకల్యం ఉన్న వారికి, ఏదైనా ప్రమాదాల్లో వైకల్యం పొందిన వారికి, మానసిక లోపాలు, కంటి చూపు సమస్యలు, మూగ, చెవిటి లాంటి సమస్యలు ఉన్న వారికి ప్రభుత్వం సదరం క్యాంప్​ల ద్వారా ధ్రువీకరణ పత్రాన్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు అందే ఏ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. కొత్తగా సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, ఇప్పటికే ఉన్న వారు రెన్యువల్ చేసుకోవాలన్నా సదరం క్యాంపులకు హాజరుకావాలి. 

ఎక్కువశాతం వైకల్యం ఉన్న వారికి శాశ్వతంగా, మరికొందరికి ఏడాది, రెండేండ్ల, మూడేండ్ల కాలపరిమితితో ఈ సర్టిఫికెట్స్​ ఇస్తారు. దివ్యాంగులు కార్లు, ఇతర వాహనాలు కొన్న సమయంలో రూ.1 లక్ష వరకు ట్యాక్స్​ బెనిఫిట్స్​ కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో ఐదు శాతం రిజర్వేషన్​ కూడా ఉంది. దీంతో కొద్దిశాతం వైకల్యం ఉన్న వారు కూడా డబ్బుల ద్వారా మేనేజ్​ చేస్తూ ఎక్కువ శాతం వైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్లు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి.

 జిల్లా స్థాయిలోని కొందరు డాక్టర్లు తమ డ్రైవర్లు, ప్రభుత్వ ఆస్పత్రిలోని అటెండర్లు, వార్డు బాయ్స్​, ఎక్స్​ రే తీసే సిబ్బందిని మధ్యవర్తులుగా చేసుకొని ఈ దందా కంటిన్యూ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెవిటి, ముగ వైకల్యం లేనప్పటికీ కొందరు డాక్టర్ దగ్గర నటించి మేనేజ్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్​ పొందుతున్న వారిలోనూ చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.

అక్రమార్కులపై చర్యలు..

సదరం శిబిరంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టికి వరుస ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శిబిరంలో లోపాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని మహిళా ప్రాంగణాధికారి విజేతను ఆదేశించారు. దాదాపు నెల రోజుల పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె నివేదికను అందించారు. ఆ నివేదిక ప్రకారం సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సీనియర్​ అసిస్టెంట్ విష్ణు వినాయక్​ ను సస్పెండ్ చేశారు. 

అక్రమంగా వైకల్యం సర్టిఫికెట్ పొందిన డేటా ఎంట్రీ ఆపరేటర్​ చరణ్​ రాజ్​ ను విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. చరణ్ రాజ్​​కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్​ (కాంట్రాక్ట్ బేసిస్​) టి.లక్ష్మణ్​ కు నోటీసులు జారీ చేశారు. 

సదరం సర్టిఫికెట్ల జారీలో పర్యవేక్షణ లోపం ఉందంటూ ఈ సర్టిఫికెట్ జారీ చేసిన సమయంలో విధుల్లో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్​ కుమార్​, ఆర్ఎంఓ రాంబాబుకు షోకాజ్​నోటీసులు జారీ చేశారు. గత రెండేండ్లుగా సదరం సర్టిఫికెట్ల జారీలో రూ.2 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.

నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతోంది

సదరం క్యాంపుల్లో కొందరు డబ్బులు తీసుకొని దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల నిజమైన దివ్యాంగులు నష్టపోతున్నారు. డాక్టర్లు, ప్రభుత్వాస్పత్రిలో లోపల ఉన్న కొందరు స్టాఫ్ అమ్ముడుబోవడం వల్ల, అక్రమార్కులు ఫేక్​ సర్టిఫికెట్లు తీసుకొని, పదోన్నతులు పొందుతున్నారు. రెండు కాళ్లు, చేతులు బాగున్నా కూడా కుక్కల చరణ్​ రాజు 75 శాతం వైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్ తీసుకున్నాడు. కాళ్లు, చేతులు పడిపోయాయని పర్మినెంట్ సర్టిఫికెట్ తీసుకున్నాడు.

 గతంలో ప్రభుత్వాస్పత్రిలో పనిచేసిన కంప్యూటర్​ ఆపరేటర్​ నరేశ్​ కూడా ఇలాగే ఫేక్​ సర్టిఫికెట్ తీసుకోవడంతో, అతడిపై కూడా కంప్లైంట్ చేసి ఆయన సర్టిఫికెట్ ను రద్దుచేయించాం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న సదరం సర్టిఫికెట్లను పూర్తిగా పరిశీలించి, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే దొంగలు బయటపడే అవకాశం ఉంది. – నాగరాజు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఖమ్మం జిల్లా అధ్యక్షుడు