- సీజన్ కు ముందే పల్లెల్లోకి చేరుతున్న పత్తి విత్తనాలు
- ఇటీవల తాండూర్ లో క్వింటాలున్నర స్వాధీనం
- ఏటా కోట్లలో సాగుతున్న దందా
- టాస్క్ ఫోర్స్ టీమ్స్ నామమాత్రమే
మంచిర్యాల, వెలుగు: నకిలీ సీడ్ దందా జోరుగా సాగుతోంది. వానాకాలం సీజన్ కు ముందే పత్తి విత్తనాలు పల్లెలకు చేరుతున్నాయి. ఈ నెల 16 మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి వద్ద పోలీసులు క్వింటాలున్నర నకిలీ విత్తనాలను పట్టుకున్న విషయం తెలిసిందే. కలెక్టర్ కుమార్ దీపక్ ఈనెల 8న డీసీపీ భాస్కర్ తో కలిసి పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్లతో నకిలీ సీడ్ అమ్మకాల నియంత్రణపై రివ్యూ మీటింగ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత వారం రోజులకే భారీ ఎత్తున నిషేధిత విత్తనాలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు రోజు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు 80 కిలోల విత్తనాలు పట్టుకున్నారు. తాండూరుకు చెందిన ఆ వ్యక్తిని విచారించి అతడి గోదాంలో మరో 5.70 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ దందా చాపకింద నీరులా గుట్టుగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
నకిలీ సీడ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా అదుపులోకి రావడం లేదు. పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ పనితీరు నామమాత్రం కావడంతో సీడ్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
ఏటా రూ.20 కోట్ల దందా
మంచిర్యాల జిల్లాలో ఏటా కోట్ల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతోంది. ప్రభుత్వ నిషేధిత హెచ్ టీ సీడ్ ను గ్లైసిల్ పేరుతో అమ్ముతున్నారు. గ్లైపొసేట్ అనే గడ్డిమందును ఈ విత్తనాలు తట్టుకుంటాయని పబ్లిసిటీ చేస్తూ రైతులకు అంటగడుతున్నారు. రైతులు సైతం కూలీల కొరత, ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు వీటికి మొగ్గు చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది.
ఇందులో దాదాపు సగం విస్తీర్ణంలో గ్లైసిల్ విత్తనాలు నాటుతున్నారు. ఎకరానికి కిలో విత్తనాలు అవసరం కాగా.. దళారులు రూ.2 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఏటా రూ.20 నుంచి రూ.25 కోట్ల వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. ప్రభుత్వ అనుమతి ఉన్న బీటీ విత్తనాల కంటే తక్కువ రేటుకు దొరుకడంతో రైతులు సైతం ఎగబడి కొంటున్నారు.
పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలను అక్రమార్కులు ఇక్కడి జిల్లాలకు చేర్చుతున్నారు. వానాకాలం సీజన్‌కు రెండు మూడు నెలల ముందుగానే దిగుమతి చేసుకొని సీక్రెట్ గా నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల నుంచి పెద్ద మొత్తంలో సప్లై అవుతున్నట్టు గత సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి, అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు.
వీరంతా ఆంధ్ర నుంచి వచ్చి వ్యవసాయం పేరుతో మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, భీమిని కన్నెపల్లి, ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఇక్కడ భూములను కౌలుకు తీసుకొని నామమాత్రంగా వ్యయసాయం చేస్తున్నారు. ఈక్రమంలో లోకల్ గా ఉన్న ఫర్టిలైజర్ డీలర్లు, రైతులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారికి అనుకూలంగా ఉన్న వారితో టీమ్ లు ఏర్పాటు చేసుకొని నకిలీ సీడ్ దందా నడుపుతున్నారు. గతంలోనే కాకుండా ఇటీవల కూడా పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్రకు చెందిన పలువురు దళారులు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం.
టాస్క్ ఫోర్స్ టీమ్స్ నామమాత్రమే..
నకిలీ సీడ్ దందాలను అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న టాస్క్ ఫోర్స్ టీమ్‌లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. ఈ టీమ్‌లో ఉండే ఆఫీసర్లలో కొంతమంది అక్రమార్కులతో చేతులు కలిపి రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దళారులు సీజన్ కు రెండు మూడు నెలల ముందు నుంచే నకిలీ విత్తనాలను పల్లెలకు చేరవేస్తుండగా టాస్క్ ఫోర్స్ టీములు మాత్రం అంతా అయిపోయాక రంగంలోకి దిగుతున్నాయి. నకిలీ సీడ్ ముఠాలు ఒకరిని అణగదొక్కేందుకు మరొకరు సమాచారం అందిస్తే తప్పా ఈ టీమ్‌లు స్వతహాగా పట్టుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఇంటర్ స్టేట్ బోర్డర్ లోని చెక్ పోస్టుల వద్ద నిఘా లోపం మరో కారణం.

