
ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఐడీ దర్యాప్తు అవసరంలేదన్న మాజీ మంత్రి బాలినేని దర్యాప్తులో జాప్యం జరుగుతుందనేది అవాస్తవమన్నారు. విచారణాధికారులు ఇప్పటికే చాలా పత్రాలు పరిశీలించారని.. ఇంకా అనేక లావాదేవీలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పాత రికార్డులను పరిశీలించేందుకు ఇంకొంత సమయం పడుతుందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా సహకరించారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ సిట్ బృందంతో పాటు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా నకిలీ డాక్యుమెంట్ల దర్యాప్తును నిష్పక్షపాతంగా చేపట్టాలని ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల పాత్ర పై దర్యాప్తును ముమ్మరం చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లోతుగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే ఎస్పీ మలిక గర్గ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూముల పై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, డీకే డెత్, ఇతర పత్రాలను సంబంధిత ఆఫీసులలో పరిశీలించడంతో పాటు, వాస్తవ యాజమాన్యాలు, డాక్యుమెంట్లను గుర్తించే పనిలో అధికారులు నిగమ్నమై ఉన్నారు. ఖాళీ స్టాంప్ పేపర్లు ఎంత మందికి అమ్మారు. వారికి ఉన్న లింకుల పై కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా ఈ విషయంలో రిజిస్ట్రేషన్‌శాఖ అధికారుల పాత్ర పై ముఖ్యంగా విచారణ జరుగుతోంది.
ఒంగోలు సబ్ రిజిష్టర్ కార్యాలయ పరిధిలోని భూములను కొనుగోలు చేసిన ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులకు చెందిన విలువైన స్థలాలను నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు. భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తాము అడిగినంత ఇవ్వాలని లేకుంటే కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం పరిపాటిగా మారింది. ఈ విధంగా గత 15 ఏళ్లుగా ఈ భూదందాను అడ్డూఅదుపు లేకుండా కొనసాగిస్తున్నారు. బాధితులు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో పోలీసులను మేనేజ్ చేయడం ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్యగా మారడంతో ఇన్నాళ్లూ వీరి బాగోతం వెలుగులోకి రాలేదు.
అంతే కాకుండా పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ సివిల్ కేసులు కావడంతో కోర్టులో చూసుకోవాలంటూ చెబుతుండటంతో బాధితులు ఏం చేయాలో అర్థం కాక అక్రమార్కులతో రాజీ పడుతున్నారు. రాజీ పడలేని వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాజాగా తాను కొనుగోలు చేసిన స్థలం ఆక్రమణకు గురైందంటూ ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తీగ లాగడంతో ఇప్పుడు అక్రమాల డొంక కదిలింది. ఈ నకిలీ పత్రాల కుంభకోణం వెనుక బడా బాబులున్నట్లు వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖకు చెందిన కొందరు అధికారులతో పాటు, డాక్యుమెంట్ రైటర్లు, సర్వేయర్లు కూడా ప్రధాన భూమిక పోషించినట్లు అనుమానిస్తున్నారు. వీరి పాత్ర పై పోలీసులు విచారణ చేస్తున్నారు.
డొంక కదిలింది ఇలా..
ఒంగోలులో నకిలీ పత్రాలతో తన భూమిని ఆక్రమించుకున్నారని ఇటీవల ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగారు., దీంతో నకిలీ పత్రాల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముతున్న నలుగురు నిందితులను గత నెల 26వ తేదిన ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేయగా,మరో నలుగురిని అక్టోబర్ 18న అరెస్టు చేశారు.
లాయర్‌పేటలోని ఓ ఇంట్లో తనిఖీలు చేయగా సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన ఆఫీసు సీళ్లు, స్టాంప్ పేపర్లు బయటపడ్డాయి. అలాగే నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు, పాత ఖాళీ స్టాంప్ పేపర్లు, ఇతర నకిలీ పత్రాలు లభించాయి. గత 15 ఏళ్ల నుంచి నకిలీ పత్రాలు, అగ్రిమెంట్లు పాతడేట్లు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాలను అవసరమైన వారికి పాతడేట్లు వేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం అందుతోంది