
హైదరాబాద్: నగరంలోని నవాబ్ సాబ్ కుంట ప్రాంతంలో ఈ నెల 1న కత్తులతో వీరంగం సృష్టించి, జనాన్ని భయబ్రాంతులకు గురి చేసిన రౌడీషీటర్ల ముఠా ను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 1 బుధవారం రాత్రి సమయంలో ఐదుగురు రౌడీషీటర్లు.. స్ధానికంగా ఉన్న వ్యాపారస్తులను, వాహనదారులను కత్తులతో బెదిరించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించిన పాతబస్తీ ఫలక్ నుమ పోలీసులు ఈ రోజు ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి తల్వార్ , మూడు కత్తులు , ఒక వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై ఫలక్ నుమా డివిజన్ ఏసీపీ ఎం ఏ రషీద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 1వ తేదీన రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన 5 గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి ఒక తల్వార్ , మూడు కత్తులు , ఒక వేట కొడవలిని స్వాధీన చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు.
ఐదుగురు నిందితుల్లో.. ఎ1.ఇస్మాయిల్(34), ఎ2.మీర్జాఖదీర్ బైగ్(26), ఎ3.ఇమ్రాన్(23), ఎ6.గులాం ముస్తఫా(26), ఎ7.మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ యూనిస్(20),లను గుర్తించి అదుపులోకి తీసుకొన్నామని ఆయన తెలిపారు. నిందితులపై హత్యయత్నం( సెక్షన్ 307), బెదిరింపు ( సెక్షన్ 506), విధ్వంసం ( సెక్షన్ 427), అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
గతంలో కూడా ఇస్మాయిల్, మీర్జా ఖదీర్ బైగ్( గతంలో అర్మ్స్ ఆక్ట్ లో నిందితుడు) లపై కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. వారందరిని జైలుకి పంపుతున్నట్లు,అలాగే నిందితులను పట్టుకోడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నట్టు ఏసీపీ రషీద్ తెలిపారు.