సందేశ్​ఖాలీపై అసత్య సందేశం

సందేశ్​ఖాలీపై అసత్య సందేశం
  •      మోదీ, బీజేపీలది దుష్ప్రచారం: మమత
  •       బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించవా?

 కోల్​కతా: సందేశ్​ఖాలీ అంశంపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ అసత్య సందేశాలు ఇస్తున్నారని, తమపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్​ చీఫ్​, బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. సందేశ్​ఖాలీ ఘటన విషయంలో తృణమూల్​ పార్టీపై దాడికి దిగుతున్న బీజేపీ నాయకులతోపాటు మోదీకి ఆదివారం ఆమె గట్టి కౌంటర్​ ఇచ్చారు. సందేశ్​ ఖాలీ ఘటనపై విమర్శలు గుప్పిస్తున్నవారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాత్రం నోరు మెదపడం లేదంటూ చురకలంటించారు.

 ‘రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు ఖండించదగ్గవే. కొన్ని సంఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ ఆ విషయం మా దాకా చేరలేదు. ఆ సంఘటనపై మాకు ఏదైనా తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తప్పుచేసి ఉంటే టీఎంసీ నేతలను కూడా అరెస్ట్​ చేస్తం’ అని మమత పేర్కొన్నారు.  కోల్​కతాలో మహిళా హక్కులపై ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని, ప్రసంగించారు. 

బుధవారం సందేశ్​ఖాలీ ఘటన విషయంలో మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీపై ఆయన పేరెత్తకుండా నిప్పులు చెరిగారు. ‘నిన్న మీరు ఇక్కడకు వచ్చి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాకు ఉపన్యాసాలు ఇచ్చారు. బీజేపీ పాలిత యూపీలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మణిపూర్​లో ఆడబిడ్డలపై లైంగికదాడి చేసి, తగులబెట్టినందుకు బీజేపీ సిగ్గుపడాలి’ అని మోదీకి పరోక్షంగా చురకలంటించారు. మహిళలకు బెంగాల్​ అత్యంత సురక్షిత ప్రదేశమని ఆమె పేర్కొన్నారు.

    మోదీ గ్యారంటీకి జీరో వారంటీ: అభిషేక్  బెనర్జీ

మోదీ గ్యారంటీకి వారంటీ లేదని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు.  కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాష్ట్రానికి వచ్చే బీజేపీ నేతలు బయటి వ్యక్తులని, బెంగాల్​ వ్యతిరేకులని దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులు ఆపినందుకు లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధిచెప్పాలని బెంగాల్​ ప్రజలకు పిలుపునిచ్చారు. 

బ్రిగేడ్​ పరేడ్​ గ్రౌండ్స్​లో ఆదివారం నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. ‘మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు. మమతా బెనర్జీ, టీఎంసీ మాత్రమే ఇచ్చిన మాట నిలుపుకొంటారు. బీజేపీ, ఆ పార్టీ నాయకులు బయటివారు.. అందుకే రాష్ట్రానికి వచ్చే నిధులను ఆపేశారు’ అని ధ్వజమెత్తారు. కాగా, భారీ ర్యాలీతో టీఎంసీ లోక్​సభ ఎన్నికల క్యాంపెయిన్​ను ప్రారంభించింది.

లోక్​సభ బరిలో యూసుఫ్ ​పఠాన్

మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్​తో పాటు పలువురు సెలబ్రిటీలకు టీఎంసీ ఎంపీ టికెట్లు కేటాయించింది. బహరంపూర్ నియోజకవర్గం యూసుఫ్ పఠాన్ బరిలో దిగనున్నాడు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌధురి ఉన్నారు. ఇప్పటి దాకా బహరంపూర్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. కాగా, వరుసగా ఐదుసార్లు అధిర్ రంజన్ చౌధురి కాంగ్రెస్ తరఫున గెలుస్తూ వచ్చారు. బాలీవుడ్ యాక్టర్ శత్రుఘ్న సిన్హా ఆసన్ సోల్ నుంచి పోటీ చేయనున్నారు. టాలీవుడ్ నటి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి పోటీ చేస్తారు. ఇక్కడ బీజేపీ ప్రత్యర్థిగా లాకెట్ ఛటర్జీ ఉన్నారు.