ఆక్సిజన్‌‌‌‌ సరఫరాపై మాట మార్చిన ఈటల

ఆక్సిజన్‌‌‌‌ సరఫరాపై మాట మార్చిన ఈటల

హైదరాబాద్, వెలుగు:రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత ఆక్సిజన్ కేటాయించిందని రెండు రోజుల క్రితం చెప్పిన మంత్రి ఈటల రాజేందర్.. ఇంతలోనే మాట మార్చారు. ఆక్సిజన్, రెమ్డిసివిర్‌‌‌‌, వ్యాక్సిన్ కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ర్టాలకు అడిగినంత ఆక్సిజన్ ఇవ్వడం లేదని, కేంద్రం వద్ద డబ్బులు లేకుంటే రాష్ర్టాలను అడగాలని అన్నారు. అవసరమైతే  కేంద్రం ఇచ్చే ఆక్సిజన్‌‌‌‌కు రేటు కట్టి డబ్బులు తీసుకోవాలని చెప్పారు. ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దేశానికే అవమానకరమన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మనకు సాయం చేయాల్సిన దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. గురువారం సెక్రటేరియట్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ఏం చేస్తలే
హెల్త్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని ఈటల అన్నారు. కానీ ఆ అధికారాలను కేంద్రం సరిగ్గా వాడడం లేదన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని ముందే చెప్పినా.. దాని తీవ్రతను ఊహించడంలో, రాష్ర్టాలను అలర్ట్‌‌‌‌ చేయడంలో ఫెయిల్ అయిందని ఆరోపించారు. అందుకే కుంభమేళాకు, ఎన్నికలకు పర్మిషన్ ఇచ్చిందని, తీవ్రతను ముందే ఊహించి ఉంటే ఇలా చేసే వారా? అని ప్రశ్నించారు. రూ.300తో ఉత్పత్తి అయ్యే రెమ్డిసివిర్‌‌‌‌కు రూ.3 వేల ఎంఆర్పీ నిర్ణయించారని ఫైర్ అయ్యారు. రూ.35 విలువ చేసే టెస్టింగ్ కిట్లను రూ.వందకు అమ్ముతున్నారన్నారు. ఆక్సిజన్‌‌‌‌ను బ్లాక్ మార్కెట్‌‌‌‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం.. ఏమీ చేయడం లేదని విమర్శించారు. టెస్టింగ్ కిట్లు, రెమ్డిసివిర్, ఆక్సిజన్ ఉత్పత్తి కంపెనీలతో మాట్లాడి, అవసరమైతే చర్యలు తీసుకుని కేంద్ర సర్కారే వాటికి ధరలు నిర్ణయించాలన్నారు. రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు, అవసరాలకు అనుగుణంగా వాటిని పంపించాలన్నారు.
పర్మిషన్ ఇస్తే వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటం
వ్యాక్సిన్ కొనుక్కునే స్థోమత రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని ఈటల అన్నారు. ‘‘రాష్ర్టంలో 18 నుంచి 45 ఏండ్ల వాళ్లు 1.7 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 3.6 కోట్లు డోసులు కావాలి. వీళ్లందరికీ మూడు నెలల్లోనే వ్యాక్సిన్ వేయగల కెపాసిటీ తెలంగాణ గవర్నమెంట్‌‌‌‌కు ఉంది. ఇందుకు నెలకు 1.2 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉంటుంది. అంతలా మన దేశంలో ఉత్పత్తి లేదు. అవసరమైతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తదా” అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తయారీకి అయ్యే ఖర్చును బట్టి, కేంద్రమే ధర నిర్ణయించాలని ఈటల డిమాండ్ చేశారు.
ఫస్ట్ నుంచి సాధ్యం కాదు
18 ఏండ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్‌‌‌‌ ఫస్ట్ నుంచి మొదలు పెట్టడం కష్టమేనని ఈటల అన్నారు. వ్యాక్సిన్ డోసులు ఎన్ని వస్తాయి? కేంద్రం నెలకు ఎన్ని ఇస్తుంది? తదితర విషయాలన్నింటిపై స్పష్టత వచ్చాకే 18 ప్లస్ ఉన్నోళ్లకు వ్యాక్సినేషన్‌‌‌‌ స్టార్ట్ చేస్తామన్నారు. వ్యాక్సిన్ కొనుగోలుపై భారత్ బయోటెక్, రెడ్డీ ల్యాబ్స్‌‌‌‌ తదితర వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సెకండ్ డోసు అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
లాక్‌‌‌‌డౌన్ ఆలోచన లేదు
రాష్ర్టంలో లాక్‌‌‌‌డౌన్ పెట్టే ఆలోచన ఇప్పటికైతే లేదని ఈటల తెలిపారు. ఇప్పుడు ప్రతి పల్లెలో కరోనా ఉందన్నారు. ఒక అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 100 మంది ఉంటే, 50 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కంటైన్‌‌‌‌మెంట్లు, ట్రేసింగ్ వంటివి సాధ్యం కాదన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్‌‌‌‌, ట్రీటింగ్ అనే జమానా పోయిందని, ఇప్పుడు సింప్టమ్స్ ఉంటే వచ్చి ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవాల్సిందేనన్నారు. టెస్టుల కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదన్నారు.

రిలేటివ్స్‌‌‌‌కు కరోనా పేషెంట్ల సమాచారానికి ప్రత్యేక వ్యవస్థ
10 రోజుల్లో అందుబాటులోకి 3,010  బెడ్స్: మంత్రి ఈటల

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల బంధువులకు సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ సూచించారు. పేషెంట్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటర్ చేయాలని తెలిపారు. ఆక్సిజన్ కోసం కనీసం 24 గంటల ముందే ప్లాన్ చేసుకోవాలన్నారు.  వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్‌‌‌‌తో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  10 రోజుల్లో 3,010  ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సిబ్బంది సంయమనంతో పని చేయాలన్నారు. కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నామని, అందుకే కాస్త మెరుగ్గా ఉన్నామని అధికారులు మంత్రికి తెలిపారు. చిన్న సమస్యలు కూడా రాకుండా చూడాలని అధికారులను మంత్రి ఈటల కోరారు.