బాచుపల్లిలో వేలానికి స్పందన కరువు..హెచ్ఎండీఏకు షాక్

బాచుపల్లిలో వేలానికి  స్పందన కరువు..హెచ్ఎండీఏకు షాక్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలానికి కొనుగోలు దారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు షాక్​కు గురయ్యారు. గతంలో వేలం వేయగా మిగిలిన భూములను అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావించిన అధికారులు.. కొనుగోలుదారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆలోచనలో పడ్డారు. 

గ్రేటర్​పరిధిలో మొత్తం 103 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 17న తుర్కయాంజాల్​లో 12 ప్లాట్లకు ఈ–వేలం నిర్వహించగా, కేవలం రెండు ప్లాట్లను కొనేందుకు మాత్రమే కొనుగోలు దారులు ముందుకు వచ్చారు. 18న బాచుపల్లిలో 70 ప్లాట్లను వేలం వేయగా, ఒక్క ప్లాటు కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం. 

మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 21 ప్లాట్లకు శుక్రవారం వేలం జరిగినా దీనికి ఎంత మంది కొనుగోలు దారులు ముందుకు వచ్చారన్న విషయాన్ని అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఆయా ప్లాట్లకు అత్యధికంగా గజం రూ.70,000 నిర్ణయించడం వల్లనే కొనుగోలు దారుల నుంచి స్పందన రాలేదని భావిస్తున్నారు. నగరంలో రియల్ ఎస్టేట్​స్తబ్దుగా ఉండడం కూడా ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. వేలం జరగని ప్లాట్లను మరోసారి వేలం వేయాలని కూడా అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.