
లక్నో: ఇరుజట్ల బ్యాటర్లు దుమ్మురేపడంతో.. ఇండియా–ఎ, ఆస్ట్రేలియా–ఎ మధ్య జరిగిన అనధికార తొలి టెస్ట్ డ్రా అయ్యింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు దేవదత్ పడ్కిల్ (150), ధ్రువ్ జురెల్ (140) సెంచరీలతో చెలరేగడంతో.. 403/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్‌ను 141.1 ఓవర్లలో 531/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
పడిక్కల్, జురెల్ ఐదో వికెట్‌కు 228 రన్స్ జోడించారు. శ్రేయస్ అయ్యర్ (8), తనుష్ కొటియాన్ (16) ఫెయిలయ్యారు. కోరీ రోచిసియోలి మూడు వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్–ఎ ఆట ముగిసే టైమ్‌కు 16 ఓవర్లలో 56/0 స్కోరు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (27 నాటౌట్), క్యాంప్‌బెల్ కెలావే (24 నాటౌట్) మెరుగ్గా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 532/6 స్కోరు చేసింది.