బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్లా రేవంత్ సర్కార్: కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్లా రేవంత్ సర్కార్: కేటీఆర్
  • ముస్లింలకు మంత్రి పదవి ఎందుకియ్యలే: కేటీఆర్
  • రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే, కౌన్సిల్​లో ఎమ్మెల్సీ లేరు
  • ఆమీర్ ఆలీఖాన్, అజారుద్దీన్​కు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని వ్యాఖ్య
  • జూబ్లీహిల్స్​లో మాగంటి​ సునీత గెలుస్తుందని ధీమా

హైదరాబాద్, వెలుగు: రేవంత్ ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ లా మారిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని విమర్శించారు. అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే, కౌన్సిల్​లో ముస్లిం ఎమ్మెల్సీ లేరన్నారు. జూబ్లీహిల్స్​లో అజారుద్దీన్​కు, ఆమీర్ ఆలీఖాన్​కు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసిందని ఆయన తెలిపారు. 


రాష్ట్ర  భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందని కేటీఆర్​అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ స్థాయి సమావేశంలో శుక్రవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని డివిజన్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఉప ఎన్నికలో సునీత తప్పకుండా గెలుస్తుందని కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి.. జూబ్లీహిల్స్ లో గులాబీ జైత్రయాత్ర తో సురుకు పెట్టాలన్నారు.  

ఆల్మట్టి ఎత్తు పెంపుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకుందని.. ఇది తెలంగాణకు మరణ శాసనమని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై స్పందించి, కర్నాటక సర్కారును అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ పని వదిలేసి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర సీఎం స్పందించినా రేవంత్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ‘‘అక్కడ, ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఉన్నా తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేదా?  జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి. కర్నాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను బలిస్తారా?  కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను అడ్డుకోకపోతే రైతులతో కలిసి పోరాడుతాం” అని కేటీఆర్ హెచ్చరించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పనికిరాకుండా పోతుందన్నారు.  కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పథకం నిర్వీర్యం అవుతుంటే పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్ గాంధీకి.. తెలంగాణలో ఆయన పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల చోరీ కనిపించకపోవడం హాస్యాస్పదమని ఓ ప్రకటనలో కేటీఆర్ ఎద్దేవా చేశారు.