ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటన దుమారం రేపింది. ఆపరేషన్ ఫెయిలై మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించగా.. బాధితులు దాన్ని తిరస్కరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందడంతో ప్రభుత్వం వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు, రూ. 4లక్షలు పరిహారం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని బాధిత కుటుంబసభ్యులు తిరస్కరించారు. కారణం చెప్పకుండా పరిహారం ప్రకటించడమేంటని.. రోడ్డుపై ఆందోళనకు దిగారు.
ఇబ్రహీంపట్నం చౌరస్తాలో చనిపోయిన మహిళ డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టారు. శస్త్ర చికిత్స వికటించి ముగ్గురు మహిళలు చనిపోయినా వైద్యారోగ్య శాఖ అధికారులు కనీసం స్పందించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఆందోళనలతో సాగర్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమించాలని కోరుతున్నారు.
ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం స్పెషల్ క్యాంపు పెట్టారు. నెలనెలా నిర్వహించే క్యాంపులో భాగంగా డాక్టర్లు 34 మందికి ఆపరేషన్లు చేశారు. నిన్న మాడుగుల మండలం నర్సయిపల్లి గ్రామానికి చెందిన 27 ఏళ్ల మమత చనిపోయింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్పిట్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
