
సూర్యాపేట, వెలుగు : వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన గణేశ్ మెడికల్ షాపు ఓనర్ రమేశ్ తన పక్కనే ఉండే నంద్యాల సురేశ్‌రెడ్డి వద్ద రెండేళ్ల క్రితం అప్పుగా రూ. 11.50 లక్షలు తీసుకున్నాడు. రూ. 10 వడ్డీ చొప్పున ఇప్పటివరకు మొత్తం రూ. 80 లక్షలు చెల్లించాడు. అప్పు తీర్చడం కోసం రమేశ్ తన ఇంటిని స్థలాన్ని సైతం అమ్మేశాడు. అయితే అప్పు తీసుకున్న టైంలో ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఆధారంగా రమేశ్ సంతకాలను ఫోర్జరీ చేసిన సురేశ్‌రెడ్డి మరో రూ. 30 లక్షలు చెల్లించాలని వేధించసాగాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించడంతో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారు పట్టించుకోకపోవడంతో మరింత వేధించసాగాడు. ఇందులో భాగంగా రమేశ్ నుంచి తీసుకున్న చెక్కులు బౌన్స్ అయినట్లు మల్లెల కృష్ణారెడ్డి, కుమ్మరికుంట్ల లింగయ్య, నరేందర్‌రెడ్డి, జ్యోతి, సోమేశ్వరరావు పేరుతో కోర్టులో కేసు వేయించాడు. దీంతో సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి సురేశ్‌రెడ్డి షాపు వద్దకు వెళ్లిన రమేశ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అడ్డుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ టైంలో మరోసారి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు ఆపేశారు. తర్వాత అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. రెండు రోజుల క్రితం రమేశ్ పిల్లలు సద్దల చెరువు వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేయగా స్థానికులు గమనించి తల్లిదండ్రులకు అప్పగించారు.