ఒక కంటి చూపు కోల్పోయిన సల్మాన్‌ రష్దీ

ఒక కంటి చూపు కోల్పోయిన సల్మాన్‌ రష్దీ

ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ ఒక కంటి చూపు కోల్పోయారు. ఒక చేయి పని చేయడం లేదని సల్మాన్ రష్దీ ఏజెంట్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రష్దీ కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే.. రష్దీ ఇంకా ఆసుపత్రిలో ఉన్నారో లేదో చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. సల్మాన్‌ రష్దీపై ఈ ఏడాది దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఆగస్టు 12వ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతోన్న రష్దీ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్ రష్దీని వెంటనే హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. సల్మాన్ రష్దీ శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయని ఆయన ఏజెంట్ చెప్పారు. మెడపై మూడు, ఛాతీపై మరో 15 తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఒక కంటి చూపునూ కూడా కోల్పోయారని తెలిపారు. నరాలు తెగిపోవడంతో ఒక చేయి పని చేయడం లేదన్నారు.