సెబీ కొత్త రూల్స్ : ఇక వారానికి ఒకే ఎక్స్​పైరీ

సెబీ కొత్త రూల్స్ : ఇక వారానికి ఒకే ఎక్స్​పైరీ
  •     డైలీ ఎక్స్​పైరీలు బంద్​
  •     ఎఫ్​అండ్​ ఓ రూల్స్​కఠినం
  •      కాంట్రాక్టు సైజు పెంపు

న్యూఢిల్లీ : ఫ్యూచర్​ఆండ్​ఆప్షన్స్​(ఎఫ్​అండ్​ఓ) ట్రేడింగ్​ రూల్స్​ను సెబీ కఠినతరం చేసింది. ఇండెక్స్ డెరివేటివ్స్‌‌‌‌లో ట్రేడింగ్​లో రిస్కును తగ్గించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త రూల్స్​ను ప్రకటించింది. ఎఫ్​అండ్​ఓ ట్రేడింగ్​ చేసే వాళ్లు విపరీతంగా నష్టపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.  ఇక మీదట ప్రతి స్టాక్ ఎక్స్ఛేంజ్ దాని బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్​లలో ఒకదానికి మాత్రమే డెరివేటివ్ కాంట్రాక్ట్‌‌‌‌లను వారంవారీ గడువుతో అందిస్తుంది. అంటే డైలీ కాంట్రాక్టులు ఉండవు. వీక్లీవి మాత్రమే ఉంటాయి. 

దీనివల్ల ట్రేడింగ్​కు తక్కువ అవకాశాలు ఉంటాయి.  ప్రమాదకర ఊహాగానాలను, అంచనాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ వర్గాలు తెలిపాయి. ఎక్స్పైరీ రోజున క్యాలెండర్ స్ప్రెడ్ ప్రయోజనాన్ని తొలగించిందని కూడా పేర్కొన్నాయి. ఇక నుంచి డెరివేటివ్‌‌‌‌లలో ట్రేడ్ చేయగల కనీస మొత్తం పెరుగుతోంది. 

నష్టాలను భరించగలిగిన వారు మాత్రమే ట్రేడింగ్​లో పాల్గొనేలా చేయడానికి సెబీ ఈ మార్పు చేసింది. కాంట్రాక్టు వాల్యూ ​ మొత్తాన్ని రూ.5–10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. డెరివేటివ్​ కాంట్రాక్టు విలువను దశలవారీగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతారు. కొత్త రూల్స్​ వచ్చే నెల 20 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తాయి. 

మరింత మార్జిన్ 

డెరివేటివ్‌‌‌‌ ట్రేడింగ్​చేసేటప్పుడు పెట్టుబడిదారులు మరింత డబ్బును  ఉంచాలి. భారీ నష్టాల నుంచి రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్​ మార్కెట్లలో భారీ నష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి వీలుగా ‘ఎక్స్​ట్రీమ్​ లాస్ ​మార్జిన్​’ (ఈఎల్​ఎం)ను వసూలు చేస్తారు. ఎక్స్​పైరీ డేస్​లో స్పెక్యులేషన్​కార్యకలాపాలు ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించి సెబీ ఈ చర్య తీసుకుంది. 

ఉదాహరణకు, ఒక ఇండెక్స్ కాంట్రాక్ట్‌‌‌‌పై వీక్లీ ఎక్స్​పైరీ 7వ తేదీన ఉంటే, ఇండెక్స్‌‌‌‌పై ఇతర వీక్లీ/మంత్లీ ఎక్స్​పైరీలు 14వ, 21వ, 28వ తేదీలలో ఉంటే, 7వ తేదీన ముగియబోయే అన్ని ఆప్షన్ కాంట్రాక్ట్‌‌‌‌లకు, 7వ తేదీన 2 శాతం అదనపు ఈఎల్​ఎం ఉంటుంది. బ్రోకర్లు ఇక నుంచి కొనుగోలుదారుల నుంచి పూర్తి ఆప్షన్ ప్రీమియంను ముందుగా సేకరిస్తారు.  వేర్వేరు గడువు తేదీలలో పొజిషన్‌‌‌‌లను ఆఫ్‌‌‌‌సెట్ చేసే సామర్థ్యం పరిమితం అవుతుందని ఎనలిస్టులు తెలిపారు. 

ఈ మార్పులు ఎందుకంటే...

ఇండెక్స్ డెరివేటివ్స్‌‌‌‌‌‌‌‌లో  ట్రేడింగ్​ చాలా ప్రమాదకరమని సెబీ గుర్తించింది. ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీస్తుందని,  పెట్టుబడిదారులకు నష్టాలను కలిగిస్తుందని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఈ సమస్యలను పరిష్కరిస్తాయని పేర్కొంది.   గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 1.13 కోట్ల మంది రిటైల్ ఎఫ్​ అండ్​ ఓ వ్యాపారులు ఏకంగా రూ. 1.81 లక్షల కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు స్టడీ వెల్లడించడంతో సెబీ ఈ చర్య తీసుకుంది. 

గత 3 సంవత్సరాలలో కేవలం 7.2శాతం వ్యక్తిగత ఎఫ్​అండ్​ఓ వ్యాపారులు మాత్రమే లాభాలు సంపాదించారు.  రిటైల్ ట్రేడర్ల సంఖ్య రెండేళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51 లక్షల మంది నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 96 లక్షలకు చేరుకుంది. మరొక సంగతి ఏమిటంటే ఎఫ్​అండ్​ఓ ట్రేడింగ్​లో అత్యధికంగా నష్టపోతున్న వారిలో తెలుగు వారే ఎక్కువని తేలింది.