IND vs AUS: అగార్కర్, గంభీర్ లెజెండ్‌ను అవమానించారు.. రోహిత్ ను వన్డే కెప్టెన్సీ తప్పించడం పట్ల ఫ్యాన్స్ ఫైర్

IND vs AUS: అగార్కర్, గంభీర్  లెజెండ్‌ను అవమానించారు.. రోహిత్ ను వన్డే కెప్టెన్సీ తప్పించడం పట్ల ఫ్యాన్స్ ఫైర్

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా సెలెక్టర్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. రోహిత్ వన్డే కెప్టెన్ గా ఇక లేడనే ఊహను  జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మ సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకుంటే హిట్ మ్యాన్ కు అన్యాయం జరిగిందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. రోహిత్ శర్మను అగౌరవపరిచారని చీఫ్ ఆఫ్ సెలెక్టర్స్ అజిత్ అగార్కర్‌పై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. 

38 ఏళ్ల రోహిత్ శర్మ టీమిండియాకు 13 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాడు. 2011 తర్వాత భారత జట్టుకు 2024 లో ఐసీసీ టైటిల్ అందించాడు. కెప్టెన్ గా భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ సాధించాడు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 56 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన హిట్ మ్యాన్ 42 మ్యాచ్ ల్లో ఇండియాకు విజయాలు సాధించాడు. 12 మ్యాచ్ ల్లో మాత్రమే భారత జట్టు ఓడిపోయింది. 62 మ్యాచ్‌ల్లో 12 ఓటములను మాత్రమే చవిచూశాడు. ఈ రికార్డులను పరిగణలోకి తీసుకుంటే రోహిత్ చేసిన తప్పేంటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.  

చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడడం దాదాపుగా ఖాయమైంది.  ఫిట్ నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. 

ఇటీవలే ఐపీఎల్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. రోహిత్ ను కెప్టెన్ నుంచి తప్పించారనే ఆలోచన వారికి కష్టంగా మారుతుంది.