స్కూళ్లకు ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్లు

స్కూళ్లకు ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్లు
  • ‘మన ఊరు మనబడి’కి ఏజెన్సీ ద్వారా ఫర్నిచర్
  • విలువైన మెటీరియల్ ​స్టేట్​ స్థాయిలో కొని బడులకు పంపనున్న సర్కారు
  • 20 మందికో టాయిలెట్.. 40 మందికో మరుగుదొడ్డి
  • ప్రతి రూంలో 4 లైట్లు, 4 సీలింగ్ ఫ్యాన్లు పెట్టాలని ప్రభుత్వ నిర్ణయం
  • డీఈఓలకు ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ స్కీమ్ ​అమలుకు చర్యలు మొదలు పెట్టింది. స్కూళ్లలో సౌలత్​లు మెరుగుపరచడానికి అవసరమైన విలువైన ఫర్నిచర్ అంతా ఎంప్యానెలింగ్ ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్ర స్థాయిలోనే కొనుగులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫస్ట్ ఫేజ్​లో ఎంపికైన బడులకు ఏమేం కావాలనే వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు సేకరిస్తున్నారు. క్లాస్​రూములు, టాయ్​లెట్లు, కంప్యూటర్ రూమ్స్​ఎలా ఉండాలనే దానిపై అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాటిని ఫాలో కావాలని డీఈవోలకు సూచించారు. రాష్ట్రంలో మొత్తం 26 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిని మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యూడైస్ లెక్కల ఆధారంగా ఎక్కువ మంది విద్యార్థులున్న 9,123 స్కూళ్లను 2021–22 అకడమక్ ఇయర్ కోసం​ఎంపిక చేశారు. వీటిలో 5,399 ప్రైమరీ స్కూల్స్ ఉండగా 1,009 యూపీఎస్, 2,715 హైస్కూళ్లు ఉన్నాయి. ఆయా బడుల్లో 12 రకాల పనుల కోసం రూ.3497.62 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. బడుల్లో ఫర్నీచర్, పెయింటింగ్, రిపేర్స్, కంపౌడ్ వాల్స్, కిచెన్ షెడ్స్, టాయ్ లెట్లు, ఎలక్ర్టిసిటీ, వాటర్, కొత్త బిల్డింగ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ తదితర వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటికి సంబంధించి మరోసారి స్కూళ్ల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు.

స్టేట్​ నుంచి కొని పంపే ఫర్నీచర్
డ్యూయల్​డెస్క్ లు, డిజిటల్​క్లాస్​రూమ్స్​మెటీరియల్, పెయింట్లు, గ్రీన్​బ్లాక్​బోర్డులు, హెచ్ఎం, సిబ్బంది ఫర్నిచర్, హైస్కూళ్లలో కంప్యూటర్​ల్యాబ్​ఫర్నీచర్, హైస్కూళ్లలో సైన్స్​ల్యాబ్​ఫర్నిచర్​రాష్ట్ర స్థాయిలో కొనుగులు చేసి నేరుగా స్కూళ్లకు పంపుతారు. ఇతర వస్తువులు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కొంటారు. 

స్టూడెంట్లను బట్టి టాయ్​లెట్లు..
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించనున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్​, దివ్యాంగ స్టూడెంట్లకు వేర్వేరుగా కట్టించనున్నారు. మూత్రశాలలు 20 మందికి ఒకటి, మరుగుదొడ్లు 40 మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. బాలికలకు 20 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించారు. వీటికి నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా వెయ్యి లీటర్ల సామర్థ్యమున్న వాటర్ ట్యాంక్ కట్టనున్నారు. 

ప్రతి రూమ్‎కు 4 ఫ్యాన్లు
బడుల్లో ప్రతి గదికి కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి క్లాస్​రూమ్​కు 4 సీలింగ్ ఫ్యాన్లు, 4 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని క్లాస్​రూముల్లో ఎలా ఏర్పాటు చేయాలనే దాన్ని కూడా మ్యాపింగ్ రూపంలో డీఈవోలకు పంపించారు. వీటితో పాటు ఇద్దరు స్టూడెంట్లు కూర్చునేలా మూడు రకాల డ్యూయల్ డెస్కులు బడులకు అందించనున్నారు. 1–3 క్లాసులకు, 4–7 క్లాసులకు, 7–10 క్లాసులకు వేర్వేరు కొలతలతో కూడిన డెస్కులు సర్కారు ఇవ్వనుంది.