- వాలెట్, పర్సు, సన్‌గ్లాసెస్, స్మార్ట్ వాచెస్‌కు నో పర్మిషన్
- భద్రపరిచేందుకు డిపాజిట్ సెంటర్లు లేక తిప్పలు
- ఐపీఎల్ నిర్వహణ తీరుపై అభిమానుల ఆగ్రహం
- ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
ఉప్పల్, వెలుగు: పోలీసుల సడెన్ నిర్ణయం క్రికెట్ అభిమానులను అసహనానికి గురి చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద క్యూలైన్లలో ఉన్న అభిమానులను వాలెట్‌లు, పర్సులు, సన్ గ్లాసెస్, స్మార్ట్ వాచెస్ తీసుకురావద్దంటూ ఎంట్రీ ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా ప్రకటించిన ప్రొహిబిటెడ్ ఐటమ్స్ జాబితాలో లేని వస్తువులను కూడా అనుమతించకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. వేల రూపాయలు ఖర్చు చేసి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన అభిమానులను క్యూలైన్ల వద్దే వెనక్కి పంపడంతో ఆందోళన వ్యక్తమైంది.
మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో వచ్చిన ఫ్యాన్స్‌కు స్టేడియంలోకి ప్రవేశం నిరాకరించడంతో పోలీసులు, నిర్వాహకులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనుమతించిన వాలెట్‌లు, ఇతర వస్తువులపై ఇప్పుడు ఆంక్షలు విధించడం సరైంది కాదని అన్నారు. తీసుకువచ్చిన వస్తువులను భద్రపరచేందుకు డిపాజిట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయలేదు.
మరోవైపు కొందరిని సన్ గ్లాసెస్ ఉన్నప్పటికీ అనుమతించారు. మ్యాచ్ చూడాలనే ఆత్రంతో కొందరు ఖరీదైన వాలెట్‌లు, సన్ గ్లాసెస్ వంటి వస్తువులను బయటే పడేసి స్టేడియంలోకి వెళ్లిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కనీసం కూర్చునే సీట్లు కూడా శుభ్రంగా లేకపోవడంతో ఫ్యాన్స్ ఇబ్బందులు పడ్డారు.
