హైకోర్టు సీజే ఉజ్జల్ ​భూయాన్​కు వీడ్కోలు

హైకోర్టు సీజే ఉజ్జల్ ​భూయాన్​కు వీడ్కోలు
  • తెలంగాణతో అనుబంధం మరిచిపోలేనిదన్న చీఫ్​ జస్టిస్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలతో అనుబంధం మరిచిపోలేనిదని, ఇక్కడి మధురానుభూతులను ఎన్నటికీ గుర్తుంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్‌‌పై వెళ్తున్న సందర్భంగా గురువారం ఆయనకు హైకోర్టు వీడ్కోలు చెప్పింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరస్పర సహకారంతోనే కేసులు పరిష్కారం అవుతాయన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర జ్యుడీషియల్‌‌ ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయ ప్రపంచంలో అహంకారానికి ఆస్కారమే ఉండకూడదన్నారు. న్యాయవ్యవస్థ ఒక కేసు ఎంత సమయంలో పరిష్కరిస్తుందో కాలపరిమితి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

కేసు నమోదైన రోజే.. దాన్ని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామో కూడా చెప్పేలా న్యాయవ్యవస్థ ఉండాలని సూచన చేశారు. ఈ మేరకు కక్షిదారులు కోరుకుంటున్నారని వివరించారు. 95 శాతానికిపైగా కక్షిదారులు కోర్టుకు ఆందోళనతో వస్తుంటారు.. వారితో గౌరవంగా వ్యవహరించడం.. వారికి న్యాయ పరిష్కారం అందించడం మా కర్తవ్యమన్నారు. న్యాయవ్యవస్థలో కీలమైన వారిలో మొదటి భాగస్వామి కక్షిదారుడేనని.. వారి తర్వాతే న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు భాగస్వాములుగా ఉంటారన్నారు. 

జస్టిస్‌‌ నవీన్‌‌రావు మాట్లాడుతూ.. ఎవరినీ నొప్పించకుండా సున్నితంగా మాట్లాడే వ్యక్తి జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ అని కొనియాడారు. ఏజీ బీఎస్‌‌ ప్రసాద్, బార్‌‌ అసోసియేషన్‌‌ చైర్మన్‌‌ నాగేశ్వర్‌‌రావు, బార్‌‌ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌ నర్సింహారెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

నేడు యాక్టింగ్‌‌ సీజేగా నవీన్‌‌రావు

హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ బదిలీ అయినందున తాత్కాలిక సీజేగా సీనియర్‌‌ జడ్జి జస్టిస్‌‌ పి.నవీన్‌‌రావు నియమితులయ్యారు. శుక్రవారం నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర లా అండ్‌‌ జస్టిస్‌‌ డిపార్ట్​మెంట్​ గురువారం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. అయితే, జస్టిస్‌‌ నవీన్‌‌రావు శుక్రవారం రిౖటైర్ కానున్నారు. ఒక్కరోజే ఆయన యాక్టింగ్‌‌ సీజేగా ఉంటారు. 

ఆ తర్వాత ఆయన తర్వాత స్థానంలో ఉన్న సీనియర్‌‌ జడ్జి జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి యాక్టింగ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త చీఫ్‌‌ జస్టిస్‌‌గా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా చేసే అలోక్ అరధే నియమించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి రికమండ్‌‌ చేసింది. ఆయన సీజేగా ప్రమాణస్వీకారం చేసే వరకు జస్టిస్‌‌ నవీన్‌‌రావ్‌‌ ఆ తర్వాత జస్టిస్‌‌ షావిలి యాక్టింగ్‌‌ సీజేలుగా వరసగా ఉంటారు.

కర్నాటక హైకోర్టుకు జస్టిస్​ కన్నెగంటి లలిత

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కన్నెగంటి లలితను కర్నాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. చాలాకాలం క్రితమే ఆమెను కర్నాటక హైకోర్టుకు ట్రాన్స్​ఫర్ ​చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 

అదే సమయంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డి, జస్టిస్‌‌ డి.నాగార్జున్‌‌ బదిలీ కూడా జరిగింది. జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డి పాట్నా హైకోర్టుకు, జస్టిస్‌‌ నాగార్జున మద్రాస్‌‌ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. అయితే, జస్టిస్‌‌ కన్నెగంటి లలిత బదిలీ మాత్రం జరగలేదు. ఏపీ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చేస్తున్నారు.