రాష్ట్రంలో ఫామ్​హౌస్​ పాలన

రాష్ట్రంలో ఫామ్​హౌస్​ పాలన
  • కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రంలో పక్కదారి పడుతున్నయ్​
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే నిజాం షుగర్స్​తెరిపిస్తం

నిజామాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. ప్రజలకు మాత్రం ఇప్పటికీ ఆ ఫలాలు అందలేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు. రాష్ట్రంలో పాలన సెక్రటేరియెట్ నుంచి కాకుండా ఫామ్​హౌస్ నుంచి సాగుతున్నదని విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2016, 2017లో సర్వశిక్షా అభియాన్ కింద కేంద్రం రూ.600 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. వాటిని టీఆర్ ఎస్​సర్కార్ దుర్వినియోగం చేసిందని ఆరోపించిన ఆయన సర్కార్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో స్కూళ్లు దారుణంగా ఉన్నాయి.. కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్రంలో పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదని మంత్రి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సేవ, పేదల సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతోందని వివరించారు. తెలంగాణాలో 40 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 
లబ్ధి చేకూరినట్లు చెప్పారు.

స్పైసెస్​ బోర్డుతో రైతులకు లాభం

స్పైసెస్​ బోర్డు ద్వారా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పసుపు రైతులకు లాభం జరిగిందన్నారు. పసుపు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. పసుపు ఎగుమతుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రెండేండ్లుగా బంగ్లాదేశ్ కు పసుపు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్న ఐదేండ్లలో పసుపు రైతుల సంక్షేమాన్ని విస్మరించారని ఆయన విమర్శించారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని మహిళపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ఆయుష్మాన్​ భారత్, ఫసల్ బీమా యోజన లాంటి పథకాలను అమలు చేయకుండా టీఆర్​ఎస్ సర్కార్​ పేదలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్​ రాగానే నిజాం షుగర్స్​ ను తెరిపిస్తామని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు.

కేంద్రం స్కీంలు తమవిగా చెప్పుకుంటున్నరు : కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్

కాగజ్ నగర్, వెలుగు : తెలంగాణ సహా బీజేపీ యేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి తమ ఘనతగా చెప్పుకుంటున్నాయని కేంద్ర జలశక్తి మిషన్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు మండిపడ్డారు. కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌లో ప్రజా సంక్షేమ పాలన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిశ్వేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎనిమిదేండ్లలో మోడీ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. 2022 నాటికి అర్హులైన పేదలందరికి సొంతిల్లు ఉండాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకుంటే సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తరహా స్కీములను వద్దనుకున్నారని విమర్శించారు. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిందన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

చిన్న రూమ్​లో 45 మంది స్టూడెంట్లా ? 

సదస్సుకు మందు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ ప్రైమరీ స్కూల్​లో పిల్లలకు బ్యాగ్​లు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడి గాలి, వెలుతురు సరిగా లేని ఇరుకైన ఒకే రూమ్​ను చూసిన ఆయన ఎందరు స్టూడెంట్స్ చదువుతున్నారని టీచర్​ను అడిగారు. 45 మంది స్టూడెంట్లు చదువుతున్నారని, అందరికి కలిపి ఒకే రూమ్ ఉందని చెప్పారు. అది విని చలించిపోయిన బిశ్వేశ్వర్ అంత మంది పిల్లలకు ఒకే రూమ్​ ఉండడం చాలా బాధాకరమన్నారు. తర్వాత కాలనీలో స్వచ్ఛ భారత్ కింద చీపురుతో ఉడ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాగా, కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసగిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు.