
- జోరుగా ఫామ్ ల్యాండ్స్ బిజినెస్
- రంగంలోకి రియల్ ఎస్టేట్ సంస్థలు
- రైతు బంధు, పీఎం కిసాన్, రైతు బీమా వర్తిస్తుందని ప్రచారం
- వ్యవసాయ భూములపై పెరుగుతున్న ఇన్వెస్ట్ మెంట్
- ధరణిలో రోజుకు సగటున 3 వేల రిజిస్ట్రేషన్లు
- గుంట,రెండు గుంటలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న తహసీల్దార్లు
వరంగల్ ప్రతినిధి, వెలుగు: రాష్ట్రంలో ఫామ్ ల్యాండ్స్ బిజినెస్ జోరుగా నడుస్తున్నది. గుంట, రెండు గుంటల ఫామ్ ప్లాట్లు మొదలు ఎకరాల కొద్ది వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల వరకు రోజూ మస్తుగా సాగుతున్నాయి. నేషనల్, స్టేట్ హైవేలకు సమీపంలో ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేలల్లో వెలుస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం, ధరణిలో గుంట, రెండు గుంటల భూమి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండడంతో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఔట్ ప్లాట్లు చేయడం మానేసి ఫామ్ ప్లాట్ల బిజినెస్ లోకి దిగారు.
ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి.. అందులో రోడ్లు వేసి గుంటల చొప్పున అమ్మేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో ఉండే జనాన్ని అట్రాక్ట్ చేసేందుకు రైతు బంధు, రైతు బీమా, పీఎం కిసాన్ వర్తిస్తుందని ప్రచారం చేస్తున్నారు. లే ఔట్ ప్లాట్ల ధరలతో పోలిస్తే రేట్ తక్కువ ఉండడంతో చాలా మంది ఫామ్ ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభయ్యాక కేవలం సాగు భూముల సేల్స్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల లావాదేవీలు జరిగాయంటే ఫామ్ ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు..
రాష్ట్రంలో నాన్ లే ఔట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. గతంలో రిజిస్ట్రేషన్ అయి ఉన్న ప్లాట్లను తప్ప.. కొత్తగా ప్లాట్లను రిజిష్టర్ చేయడం లేదు. ధరణి పోర్టల్ వచ్చాక గుంట, రెండు గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈజీ కావడం వారికి కలిసి వచ్చింది. స్టేట్, నేషనల్ హైవేలకు, పట్టణాలకు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలోని ఎకరం సాగు భూమిని రూ.30 లక్షల నుంచి 50 లక్షలకు కొనుగోలు చేసి గుంట(121 గజాలు) ప్లాట్ ను రూ. రెండు, మూడు లక్షలకు అమ్మేస్తున్నారు. ఏరియాను బట్టి, మార్కెట్ వాల్యూను బట్టి ఒక్కో ఫామ్ ప్లాట్‌ను గజానికి రూ.1,000 నుంచి 10 వేల దాకా అమ్ముతున్నారు. ప్లాట్ లో ఎర్రచందనం, శ్రీగంధం, పండ్ల మొక్కలు తామే పెంచి ఇస్తామని బ్రోచర్లలో ప్రచారం చేస్తున్నారు.
బిజినెస్ లోకి బడా రియల్ ఎస్టేట్ సంస్థలు
ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌస్‌కు డిమాండ్ పెరగడంతో.. అధికారికంగా లేఔట్లు వేసి అమ్మే పేరు మోసిన బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టాయి. సోషల్ మీడియా వేదికగా యాడ్స్ గుప్పిస్తున్నాయి. గతంలో జీవో నంబర్ 111 పరిధిలో ఉన్న ల్యాండ్స్ లో, ఓఆర్ఆర్, ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ వెంట ఈ దందా ఎక్కువగా నడుస్తున్నది. మెగా ప్రాజెక్టు పేరుతో వందలాది ఎకరాల్లో వెంచర్లు వేస్తున్నారు.
ధరణిలో 10 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు..
ధరణి పోర్టల్ సేవలు 2020 నవంబర్ 2 నుంచి అందుబాటులోకి వచ్చాక గడిచిన 22 నెలల్లో వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు 10 లక్షలు దాటడం విశేషం. మొదటి ఏడాదిలో 5 లక్షల సేల్ రిజిస్ట్రేషన్లు జరిగితే, రెండో ఏడాదిలో 10 నెలల్లోనే మరో 5 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు 2,56,730 జరగగా, ఫౌతీ(వారసత్వ) రిజిస్ట్రేషన్లు 1,59,346 జరిగాయి. ఫామ్ ల్యాండ్స్‌కు సంబంధించి ధరణిలో రోజుకు సగటున 3వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
సర్కార్ ఆదాయానికి గండి..
ఫామ్ వెంచర్లతో సర్కార్ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. ప్రభుత్వానికి నాలా కన్వర్షన్, డెవల్మెంట్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదా యం పోతోంది. మున్సిపాలిటీలు, పట్టణా భివృద్ధి సంస్థల పరిధిలో ప్లాట్ విస్తీర్ణం 20 గుంట లకు తక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయొద్దని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ నిరుడు జులై 9న రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, సీసీఎల్ఏకు లెటర్ రాశారు. ఏడాది దాటినా అర్వింద్ కుమార్ రాసిన లెటర్ పై రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీస్ సోమేశ్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇదే లెటర్ ఇప్పుడు కొందరు తహసీల్దార్లకు కాసులు కురిపిస్తున్నది. లేఔట్ పర్మిషన్ కోసం ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడంతోపాటు చాలా రూల్స్ పాటించాల్సి ఉండడంతో కొందరు రియ ల్టర్లు సాగు భూములను ఫామ్ ల్యాండ్స్ పేరిట రెండు గుంటలు, మూడు గుంటలను ఒక ప్లాటుగా చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు కొందరు తహసీల్దార్లకు వరంగా మారాయి. గుంట, రెండు గుంటలు రిజి స్ట్రేషన్ చేయడానికి వీల్లేదని కొందరు తహసీల్దార్లు చెప్తూనే.. చేసి పెడ్తున్నారు. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రియల్టర్ల వద్ద రూ.5 వేల నుంచి రూ.15వేల దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చాంతాడంత బై నంబర్లు..
హైవేల వెంట, పట్టణాలకు శివారులో సాగు భూములకు సింగిల్ డిజిట్లో ఉన్న సర్వే నంబ ర్లు కాస్తా పదుల సంఖ్యలో బై నంబర్లుగా మారిపోతున్నాయి. పట్టాదారులు కూడా ఒకటికి నాలుగుసార్లు లెక్కిస్తే తప్ప ఆ బై నంబర్ల లెక్క చిక్కడం లేదు. ఫామ్ ల్యాండ్స్ పేరిట రియల్ ఎస్టేట్ దందా సాగుతున్న ఏరియాల్లోని వివరాలను ధరణి పోర్టల్‌లో చెక్ చేస్తే ఒక్కో సర్వే నంబర్.. బై నంబర్లతో చాంతాడంత లిస్టు కనిపిస్తున్నది. అన్ని అనుమతులు తీసుకుని లే ఔట్ వెంచర్ వేస్తే లక్షలాది రూపాయలు ఖర్చవుతాయని, వ్యవసాయ భూమినే ఫామ్ ప్లాట్లుగా చేసి అమ్మితే పెద్దగా ఖర్చే లేదని రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒకరు వెల్లడించారు.
40/2/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లిలోని సర్వే నంబర్ ఇది. ఈ సర్వే నంబర్‌లో ఉన్న భూమి 2 గుంటలు. మొత్తం 40వ సర్వేనంబర్ లో 11.010 ఎకరాల భూమి ఉంది. ఇందులో చాలా మంది గుంట, 2 గుంటలు భూమి కొనుగోలు చేయడంతో వ్యవసాయ భూమిని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ ఒక్క సర్వే నంబర్ కు 44 బై నంబర్లు క్రియేట్ చేయాల్సి వచ్చింది.
59B/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో ఒక సర్వే నంబర్ ఇది. ఈ సర్వే నంబర్‌లో ఉన్న భూమి 5 గుంటలు. ఎకరాల్లో ఉన్న వ్యవసాయ భూమిని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ ఇన్ని బై నంబర్లు క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ గజానికి రూ.1,800 చొప్పున 5 గుంటలు రూ.10 లక్షలకు అమ్ముతున్నది.
1/ఉ/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1 రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మక్త బహదూర్ అలీ రెవెన్యూ విలేజ్ పరిధిలోని సర్వే నంబర్ ఇది. ఈ సర్వే నంబర్‌లో 0.0103 గుంటల భూమికి పట్టాదారు పాస్ బుక్ జారీ అయింది. మొత్తం 1వ సర్వే నంబర్ లో 80 బై నంబర్లు ఉండడం గమనార్హం. భూమి పట్టాదారును నీ సర్వే నంబర్ ఎంత అంటే.. 1వ నంబర్ అని చెప్పడం తప్పా.. చాంతాడంతా ఉన్న బై నంబర్లను టపీమని చెప్పడం కష్టమే.