
- బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో ఘటన
- అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్య: మృతుడు శంకర్ భార్య లక్ష్మి
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం హన్మాజిపేట్ గ్రామంలో శంకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వరి ధాన్యం కుప్ప కావలికి వెళ్లి రాత్రి కుప్ప దగ్గరే పురుగుల మందు తాగి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు శంకర్ భార్య లక్ష్మి విలపిస్తూ చెప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి.
హన్మాజిపేట్ గ్రామానికి చెందిన సింగం శంకర్ సన్నకారు రైతు. కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. తన కూతురు అనారోగ్యానికి గురికావడంతో అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నాడు. సుమారు 15 లక్షల వరకు అప్పు కావడంతో రెండెకరాల పొలం కూడా అమ్మేసుకున్నాడు. అయినా అప్పులు తీరలేదు. అప్పులిచ్చిన వారికి ఎలా సమాధానం చెప్పుకోవాలోనని మధనపడుతూ ఉండేవాడు. నిన్న సాయంత్రం వరి ధాన్యం కుప్ప కావలికి వెళ్లి ధాన్యం రాశి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో ఎలా చెల్లించాలోనని మధనపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్ట్ మార్టం కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.