లిక్కర్​ తాగొద్దన్నందుకు.. వరి చేనుకు గడ్డి మందు కొట్టిండు

లిక్కర్​ తాగొద్దన్నందుకు.. వరి చేనుకు గడ్డి మందు కొట్టిండు

గన్నేరువరం, వెలుగు: పొలం వద్ద లిక్కర్ తాగొద్దన్నందుకు తన వరి చేనుకు గడ్డి మందు కొట్టారని ఓ రైతు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్​జిల్లా గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల సాయిలు తన పొలంలో వరి సాగుచేశాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రతిరోజు సాయంత్రం సాయిలు పొలం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో మందు తాగేవాడు. 

సోమవారం మందు తాగుతున్న సదరు వ్యక్తిని సాయిలు మందలించాడు. తన పొలం వద్ద మందు తాగొద్దని చెప్పాడు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి అర్ధరాత్రి సాయిలు వరి చేనుకు గడ్డి మందు పిచికారీ చేశాడు. తెల్లారేసరికి వరి మాడిపోయింది. మంగళవారం ఉదయం పొలం వెళ్లిన సాయిలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.