
- భూమి విషయంలో కొందరు ఇబ్బందులు పెట్టారంటూ ఆత్మహత్య
- చనిపోవడానికి ముందు పురుగుల మందు డబ్బాతో వీడియో రికార్డ్
ఖమ్మం, వెలుగు: మధిర నియోజకవర్గం పొద్దుటూరులో భూవివాదం నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బోజెడ్ల ప్రభాకర్ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. అంత్యక్రియల సమయంలో మృతుడి పిల్లలను పట్టుకొని ఇక ఈ పిల్లలకు దిక్కెవరంటూ ప్రభాకర్ తండ్రి వీరయ్య ఏడవడం అందరికీ కన్నీళ్లు తెప్పించాయి. గ్రామంలో తనకు చెందిన చెరువు మునక భూమి మూడెకరాల విషయంలో కొందరు కావాలని ఇబ్బంది పెడుతున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ సోమవారం సాయంత్రం ప్రభాకర్పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కుటుంబసభ్యులను ఆదుకోవాలంటూ తన సెల్ఫోన్లో పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని ఓ వీడియో రికార్డు చేశారు. చనిపోవడానికి ముందు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. తన భూమికి దగ్గర్లో ఉన్న చెరువు నుంచి మొరం తోలించుకుంటే..కొం దరు కక్షపూరితంగా వ్యవహరించి జేసీబీ, ప్రొక్లెయిన్ తో చెడగొట్టారని వీడియోలో ప్రభాకర్ చెప్పాడు. అయితే, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ప్రభాకర్ ఒంటరిగా లేడని, ఆయనతో గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూడా ఉన్నారని సమాచారం.
వీడి యోను వాళ్లిద్దరే రికార్డు చేశారని తెలుస్తోంది. ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆ ఇద్దరూ పరారీలో ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొందరు గ్రామస్తుల వేధింపులతోనే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విచారణకు సీఎం ఆదేశం
రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆత్మహత్యకు కారణాలేమిటో తేల్చాలని రెవెన్యూ, పోలీస్ శాఖను ఆదేశించారు.