
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లాలో భూమి విషయంలో ఎస్సై వేధిస్తున్నాడని ఓ రైతు పురుగుల మందు తాగాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన ఇనవేణి నర్సయ్య తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమిలోని 2 ఎకరాలను ఓ ఎస్టేట్ వ్యాపారికి అమ్ముకున్నాడు. అయితే సదరు వ్యాపారి 2 ఎకరాలతోపాటు 20 గుంటలను కూడా తన పేరిట రిజిస్ట్రేషన్చేసుకున్నాడు. తర్వాత మొత్తం భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నాడు. అయితే ప్లాట్లు కొన్నవారు భూమిని చదును చేసేందుకు రాగా నర్సయ్య అడ్డుకున్నాడు. ఈ విషయంలో స్థానిక ఎస్సై శంకర్ప్లాట్లు కొన్నవారికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. తమను వేధిస్తున్నాడంటూ నర్సయ్య సోమవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఎస్సై తీరును నిరసిస్తూ బాధితుని కుటుంబ సభ్యులు, మస్కాపూర్ గ్రామస్తులు ఖానాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. అదే టైంలో అక్కడికి వచ్చిన ఎస్సై వెహికల్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శంకర్ వివరణ ఇస్తూ.. సదరు భూమి వద్ద ఇరు వర్గాల మధ్య గొడవ జరగకుండా చూశానని, కోర్టు లేదా రెవెన్యూ అధికారుల వద్ద సమస్యను పరిష్కరించుకోవాలని సూచించానే తప్ప వేధించలేదన్నారు.
సర్పంచ్ తిట్టాడని మహిళా కూలీ..
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్లు సర్పంచ్ శ్రీశైలం తిట్టాడని ఓ మహిళా కూలీ ఆత్మహత్యకు యత్నించింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఈ నెల 7న ఉపాధి పనులకు సంబంధించిన కూలి పైసలు రాలేదని గ్రామానికి చెందిన చెవిటి పద్మ, మరికొందరు కూలీలు సర్పంచును ప్రశ్నించారు. ఆగ్రహానికి గురైన శ్రీశైలం పద్మను బూతులు తిట్టాడు. ఆదివారం పంచాయతీ ఆఫీసు వద్ద తన భర్త ముందే పద్మను సర్పంచ్మరోసారి బూతులు తిట్టాడు. భరించలేక ఆమె సోమవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. భర్త జంగయ్య ఫిర్యాదు మేరకు సర్పంచ్ చెవిటి శ్రీశైలం, ఆయన తల్లి కిష్టమ్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.