
- ‘సీతారామ, మున్నేరు’ భూ సేకరణపై సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో కాన్ఫరెన్స్ హాల్లో సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు నదీ భూ సేకరణ, ప్రత్యామ్నాయ భూమి లేఔట్ అభివృద్ధిపై జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిలో అసైన్డ్ ప్రభుత్వ పట్టా ఎంత ఉంది, ప్రైవేట్ పట్టా భూమి ఎంత సేకరించాలో స్పష్టమైన సమాచారంతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూమి ఎంత సేకరించాలో వివరాలు అందిస్తే ప్రత్యామ్నాయ భూముల్లో అటవీ పెంపకం చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో మండలాల వారీగా సేకరించాల్సిన అటవీ భూమి, అసైన్డ్ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ పట్టా భూముల వివరాలతో శుక్రవారం నాటికి నివేదిక అందించాలని ఆదేశించారు.
భూ సేకరణలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీజీపీఐ లాంటి ఆధునిక సర్వే యంత్రాలను ఉపయోగించి జూన్ 12 నాటికి వివిధ కేటగిరీలవారీగా భూ సేకరణకు సంబంధించిన తుది నివేదిక తయారు చేయాలన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ 17 కిలో మీటర్ల స్ట్రెచ్ లో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలని చెప్పారు.
రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రత్యామ్నాయ లేఔట్ భూ అభివృద్ధి పనులు స్పీడప్చేయాలని, దశలవారీగా అవసరమైన నిధుల వివరాలు త్వరగా చెల్లింపులు అయ్యేలా చూస్తామని తెలిపారు. ప్రజలకు అందించే భూములలో లేఔట్ అభివృద్ధి అంతర్గత రోడ్లు, కనెక్టివిటీ అంశాలు ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.